వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. అనంతపురం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్లతో రహదారులు, డ్రెయినేజి ఇతర అభివృద్ధి పనులు చేపట్టాం. కానీ కొన్ని రోజులుగా ప్రతిపక్ష టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు.
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఐదేళ్ల పాటు అనంతపురం అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు కుమ్ములాటకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మేం మాటలు చెప్పం.. చేతల్లో చూపిస్తాం. మా పనితీరే వాళ్లకు సమాధానం అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు.
రెండేళ్ల ప్రభుత్వ పనితీరు ఫలితంగానే స్థానిక సంస్థలు, మునిసిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. నగరంలోని 30వ డివిజన్ పరిధిలోని జయమనెమ్మ కళ్యాణ మండపం సమీపంలో రూ.10 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులను మేయర్ మహమ్మద్ వసీం, కమిషనర్ పీవీవీఎస్ మూర్తితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రానున్న రోజులు అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం కాబట్టే, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా వైసీపీని ప్రజలు ఆదరించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన కొనసాగిస్తామన్నారు.
ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని, త్వరలోనే అనంతపురం సర్వజనాస్పత్రి విస్తరణ పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా బళ్లారి బైపాస్ నుంచి నగరం మీదుగా పంగల్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు కూడా చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో జరిగే ఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయం చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వాళ్ల ఆరాటమంతా రాజకీయ ఉనికి కోసమేనని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, 30వ డివిజన్ కార్పొరేటర్ నరసింహులు, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, వెంకట రమణ, రామాంజనేయులు, కమల్‌భూషణ్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.