Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ బుర్ర తక్కువ నిర్ణయాలతో రాష్ట్రం నవ్వులపాలు: అయ్యన్నపాత్రుడు

Advertiesment
జగన్ బుర్ర తక్కువ నిర్ణయాలతో రాష్ట్రం నవ్వులపాలు: అయ్యన్నపాత్రుడు
, బుధవారం, 15 జులై 2020 (08:02 IST)
రాష్ట్రంలో జరుగుతున్నది తుగ్లక్ పాలనే అనడానికి జగన్ చేస్తున్న పనులు, ఆయన తీసుకుంటున్న బుర్రతక్కువ నిర్ణయాలే కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవాచేశారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని నిర్మాణ పనులు నిలిపివేత, పోలవరం పనుల ఆపివేత, రంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయడం, ఇసుకకొరత, కొత్త మద్యం పాలసీ, ఇళ్లస్థలాల పేరుతో వేలకోట్ల అవినీతికి పాల్పడటం వంటి పనులన్నీ జగన్ చేతగానితనానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయడం ద్వారా ఈ ప్రభుత్వం ఏంసాధించిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. అమరావతి నిర్మాణం కోసం 34వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 200రోజులకు పైగా ధర్నాలు చేస్తున్నా, జగన్ వారి గురించి పట్టించుకోవడం దారుణమని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో జాతీయప్రాజెక్ట్ గా కేంద్రంతో గుర్తించబడి, 70శాతంపనులు పూర్తిచేసుకున్న పోలవరం నిర్మాణం ఈ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయకపోగా, రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేసి, తమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టడం ద్వారా ప్రాజెక్ట్ ను ఈ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.

పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడంద్వారా జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. మాది రైతుప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ, పోలవరం నిర్మాణ పనులను ఎందుకు కొనసాగించడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక దండిగా లభిస్తున్నా, ప్రభుత్వం నూతన పాలసీ పేరుతో కృత్రిమ కొరత సృష్టించిందన్నారు.

ఇసుక లేకపోవడంతో భవననిర్మాణ కార్మికులతో పాటు, ఉడ్ వర్కర్స్, పెయింటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ల వంటి 20 లక్షలమంది ఉపాధిలేక పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని అయ్యన్న ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారం చేస్తూ, టన్నులకు టన్నులు పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని మహిళలకు మాటిచ్చిన జగన్, ఇప్పుడు అధిక ధరలకు విషాన్ని అమ్ముతూ, అదే మహిళల పుస్తెలు తెంచుతున్నాడన్నారు.

చాలా ప్రాంతాల్లో గంజాయి, నాటుసారా విక్రయాలు విపరీతంగా జరుగతున్నాయని, అవి తాగడం వల్ల లక్షలమంది పేదలు ఆసుపత్రుల పాలై తమ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవేవీ ముఖ్యమంత్రికి, ఎక్సైజ్ శాఖకు తెలియదా అని అయ్యన్న ప్రశ్నించారు. కరోనాతో ఉపాధిలేక, పనులు లేక ప్రజలు అల్లాడుతుంటే, బుద్ధి ఉన్న వాడెవడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుతాడా అని మాజీ మంత్రి మండిపడ్డారు. 

గత ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్లుకట్టించిందని, కేంద్రప్రభుత్వ సహాకారంతో లక్షల ఇళ్లను నిర్మించిందన్నారు. 80శాతం వరకు పూర్తయిన 10లక్షల ఇళ్లను ఈ ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా వారిని వేధించుకు తింటోందన్నారు. కోట్ల రూపాయల ఖర్చుతొ 80శాతం పూర్తయిన ఇళ్లను మిగతా 20శాతం పూర్తిచేయడానికి జగన్ కు ఎందుకు మనసు రావడం లేదన్నారు.

సుమారు రూ.3వేలకోట్ల ప్రజాధనాన్ని రంగులకోసం ఖర్చు చేసిన ప్రభుత్వం, అదేసొమ్మును ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ నిర్మాణానికి వెచ్చించి ఉంటే, ఆప్రాజెక్ట్ పూర్తై ఉండేదన్నారు. తద్వారా ఉత్తరాంధ్రలోని సుమారు 3లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు. 

ఇళ్లస్థలాల కోసం పనికిరాని భూములను ప్రజల సొమ్ముతో కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, ముంపు ప్రాంతాల్లో, వాగులు, చెరువుల పక్కన, శ్మశానాల దగ్గర, ఊళ్లకు దూరంగా పేదలకు స్థలాలిస్తే, వారు అక్కడ ఎలా నివాసముంటారో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ఇళ్లస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం రూ.5వేలకోట్ల అవినీతికి పాల్పడిందని, తక్కువ విలువచేసే భూములను ఎక్కువ ధరకు కొన్న వైసీపీ నేతలు ప్రభుత్వ సొమ్మును దింగమింగేశారన్నారు.

ఇళ్లస్థలాల పంపిణీ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసే భారీ అవినీతికి పాల్పడినా ప్రభుత్వం, ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకపక్క డబ్బుల్లేవంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న ప్రభుత్వపెద్దలు, మరోపక్క ప్రభుత్వ సొమ్మును ఇష్టమొచ్చినట్లు కాజేస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

14 నెలల వైసీపీ పాలనలో ఏవర్గానికి మేలు జరగలేదని, సుమారు రూ.18వేలకోట్ల విలువచేసే సంక్షేమపథకాలను ఈ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా ప్రతివర్గానికి జగన్ సర్కారు తీరని అన్యాయం చేసిందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం 2018-2019లో బీసీలకు రూ.6,419కోట్లను ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక 2019-20 సంవత్సరానికి బడ్జెట్ లో కేవలం రూ.3,382కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. సగానికి సగం పైగా నిధులను బీసీలకు కోతపెట్టిన ఈ ప్రభుత్వం, బీసీలను ఎలా ఉధ్దరించిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. బీసీ సోదరులు ప్రభుత్వం చెబుతున్న మోసపూరిత మాటలపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.

బుర్ర తక్కువ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం జగన్  కు తగదన్నారు. ఒక్క ఛాన్స్ అనగానే రాష్ట్రాభివృద్ధిని, భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించకుండా, జగన్ కు ఓట్లేసిన వారంతా ఈనిజాలు తెలుసుకోవాలన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలైందని, ఇందుకు కారణం ప్రజల ఓట్లతో గెలిచిన జగనా.... లేక జగన్ కు ఓటేసిన ప్రజలో వాళ్లే చెప్పాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లూరి సీతారామరాజు పేరిట కొత్త జిల్లా.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పర్యాటక ప్రాంతాలకు అనుమతి: మంత్రి అవంతి శ్రీనివాస్