Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శక్తివంతమైన హిందూ సమాజమే అన్ని సమస్యలకు సమాధానం: ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర ప్రచారక్

శక్తివంతమైన హిందూ సమాజమే అన్ని సమస్యలకు సమాధానం: ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర ప్రచారక్
, సోమవారం, 27 జనవరి 2020 (07:38 IST)
అనేక వందలేళ్ళుగా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులు, ధార్మిక మూలాలను బలహీనపరిచే దుష్ప్రయత్నాలను ఇక హిందూ సమాజం సహించే పరిస్థితి పోయి శక్తివంతమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణాది రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్ తెలిపారు.

370 అధికరణ కానీ, అయోధ్య సమస్యకు కానీ విముక్తి కలిగిన తీరే ఇందుకు తార్కాణమని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కొన్ని రాజకీయపార్టీల స్వార్థ ప్రయోజనాల వల్లే అనవసర రాద్ధాంతం చోటుచేసుకుందని ఆయన తెలిపారు.

పౌరసత్వాన్ని ఇచ్చేదే కానీ తీసుకోని ఈ చట్టాన్ని బూచిగా చూపి అస్థిరత్వం, అరాచకాలు ప్రేరేపించే కుటిల పన్నాగాలను పన్నుతున్న శక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు.

దేశ ప్రజలకు కానీ ముఖ్యంగా ఇక్కడున్న అల్పసంఖ్యాక వర్గాలకు కానీ ఎటువంటి హాని చేయని పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకించడం భావ్యం కాదని అన్నారు.  ఆర్.ఎస్.ఎస్ విజయవాడలో పథసంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్ ప్రసంగించారు. 
 
పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో అల్పసంఖ్యాకులైన హిందువులు తదితర ఆరు మతాలకు చెందిన వారిని తీవ్ర స్థాయిలో వేధించి మతమార్పిడులు, రక్తపాతం సృష్టించడం వల్ల వారు దిక్కు లేని పరిస్థితుల్లో భారత్ లోకి శరణు కోరి వస్తే వారికి ఆశ్రయం ఇవ్వడం తప్పా?

శరణు కోరే వారికి అక్కున చేర్చుకోవడం  తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయం కాదా...!  అని శ్యామ్ కుమార్ ప్రశ్నించారు. అక్రమ చొరబాటుల పట్ల మాత్రం కఠినంగా ఉండాలని ఆయన అన్నారు.

మతమార్పిడులు ద్వారా కొన్ని శక్తులు  ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రమాదకారులుగా పరిణమించారని, ఈ దేశాన్ని ధిక్కరించేలా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని అయోధ్య సమస్య పరిష్కారం కాకుండా అనేక సందర్భాల్లో అడ్డం పడ్డ వారికి ఈ సారి న్యాయస్థానం చెంప పెట్టు లాంటి పరిపూర్ణ తీర్పు ఇచ్చిందని అన్నారు.

370 అధికరణ విషయంలో కూడా డబ్బై ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు ఇటీవల విముక్తి కలిగిందని, ఇవన్నీ తిరిగి హిందువులు శక్తివంతంగా అవుతున్నారు అనడానికి నిదర్శనమని శ్యామ్ కుమార్ అన్నారు. 95 సంవత్సరాల క్రితమే ఇటువంటి పరిస్థితులను ఊహించిన డాక్టర్ హెడ్గేవార్ హిందువుల్లో ఐక్యత, సంఘటిత శక్తి పెంపొందించాలని ఆర్.ఎస్.ఎస్ స్థాపించారని శ్యామ్ కుమార్ తెలిపారు.

ఒక్క వ్యక్తిలో వచ్చిన ఈ ఆలోచన ఈ రోజు దేశవిదేశాల్లో లక్షలాది స్వయంసేవకులను చైతన్యవంతులైన  స్వయంసేవకులను తీర్చిదిద్దిందని ఆయన వెల్లడించారు. సుమారు 50 దేశాల్లో సంఘ శాఖలు నేడు నడుస్తున్నాయని శ్యామ్ కుమార్ చెప్పారు. 

ఈ కార్యక్రంలో పాల్గొన్న రిటైర్డ్ లెఫ్టనెంట్ జనరల్ వి.కె.చతుర్వేది మాట్లాడుతూ దేశాన్ని విచ్చిన్నం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా,  అటు సైనికులకు  ఇటు స్వయంసేవకులకు  ఈ దేశాన్ని కాపాడుకునే శక్తి ఉందని అన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నిర్వీర్యం కాకూడదని, ఇందులో ఆర్.ఎస్.ఎస్ చేసే ప్రయత్నాలకు భారతీయులంతా బాసటగా నిలవాలని అన్నారు. 

ఆర్.ఎస్.ఎస్.విజయవాడ విభాగ్ సంఘచాలక్ నార్ల వినయ కుమార్, మహానగర్ కార్యవాహ వల్లూరు మదన్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య చాలా మంచిది.. ఆమెకు రెండో పెళ్లి చేయండి.. సూసైడ్ లెటర్‌లో భర్త