Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధునిక లేపాక్షి ఎంపోరియం నేడు ప్రారంభం

ఆధునిక లేపాక్షి ఎంపోరియం నేడు ప్రారంభం
, గురువారం, 19 నవంబరు 2020 (07:54 IST)
విజయవాడ లేపాక్షి ఎంపోరియం ఆధునిక హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో విజయవాడ వేదికగా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన మెగా ప్రదర్శనశాల శుక్రవారం కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. 

పునరుద్ధరణ ద్వారా సరికొత్త రూపును సంతరించుకున్న లేపాక్షి ప్రదర్శన శాలను పరిశ్రమలు,వాణిజ్యం, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ,మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవంబరు 19 తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.

మన రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే ధ్యేయంగా చేతితో తయారు చేసిన హస్తకళలను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్ధ ఏర్పాటు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 17, ఇతర రాష్ట్రాలలో సైతం మూడు ప్రదర్శన శాలలు హస్తకళలపై మక్కువ కలవారి అవసరాలను తీర్చుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థను రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన హస్తకళల అభివృద్ధి,ప్రమోషన్, మార్కెటింగ్ వంటి ప్రధాన లక్ష్యాలతో స్థాపించగా, రాష్ట్రంలోని 17 ప్రదర్శన శాలలతో పాటు, కోల్‌కతా, కొత్త దిల్లీ, హైదరాబాద్ లోని మూడు షోరూమ్‌ల ద్వారా మార్కెటింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.50 కోట్ల అమ్మకాల టర్నోవర్ లక్ష్యంగా సంస్ధ పయనిస్తుందని లేపాక్షి నిర్వహణా సంచాలకులు లక్ష్మినాధ్ వివరించారు.    
 
ఈ సందర్భంగా లేపాక్షి నిర్వహణ సంచాలకులు లక్ష్మినాధ్ మాట్లాడుతూ  హస్తకళల రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఇది గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంత ప్రజలకు ఆర్ధిక స్వావలంబనను అందిస్తుందని వివరించారు. 

రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటమే కాక, ఈ రంగంలో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది హస్త కళా కారుల సంక్షేమం విషయంలో కూడా గణనీయమైన భూమికను కలిగి ఉందన్నారు. సంస్ధ  చేపట్టిన మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా వారు ప్రయోజనం పొందుతున్నారని లక్ష్మినాధ్ అన్నారు.

విజయవాడలో ఆదునీకరించిన ప్రదర్శన శాలలో చిత్తూరు జిల్లాకు చెందిన వుడ్ కార్వింగ్స్ , కలాంకారి పెయింటింగ్స్ మొదలు గుంటూరు జిల్లా దుర్గి  రాతి శిల్పం; బుదితి  ఆదివాసి పెయింటింగ్; శ్రీకాకుళం జిల్లా సీతాంపేట ఇత్తడి వస్తువులు; ఉదయగిరి నుండి చెక్క కత్తులు; బొబ్బిలి వీణ; విశాఖపట్నం ఏటికొప్పాక బొమ్మలు; పెడన, మంగళగిరి చేనేత వస్త్రాలు, కృష్ణ జిల్లా కొండపల్లి బొమ్మలు, కలంకరి బ్లాక్ ప్రింట్లు తదితర కళాకృతులు అందుబాటులో ఉంటాయన్నారు.
 
ఎగ్జిబిషన్లు, క్రాఫ్ట్ బజార్లు, శిక్షణ, డిజైన్ వర్క్ షాపుల నిర్వహణ, స్కిల్ అప్-గ్రేడేషన్ కార్యక్రమాలు, ఎంచుకున్న చేతిపనుల కోసం సాధారణ సౌకర్య కేంద్రాలు, ఎపి క్రాఫ్ట్స్ యొక్క భౌగోళిక సూచిక, రా మెటీరియల్ బ్యాంక్, సంక్షేమ పథకాలు, అవార్డుల పంపిణీ, రాష్ట్ర చేతి వృత్తుల ప్రచారం, వృద్ధాప్య పింఛన్లు తదితర అంశాలపై సంస్ధ ప్రత్యేకంగా దృష్టి సారించి విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.

మార్కెట్ డిమాండ్ ను అనుసరించి డిజైన్ వర్క్ షాపుల నిర్వహణ ద్వారా వివిధ చేతిపనులలో వైవిధ్యతను సాధించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎగుమతి మార్కెట్లను అన్వేషించి, ఆంధ్ర హస్తకళల యొక్క మార్కెట్ స్ధాయిని, బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరచి తగిన ప్రాచుర్యం పొందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తదనుగుణమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

మరోవైపు ప్రభుత్వం స్పాన్సర్ చేసిన అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్లలో కూడా లేపాక్షి పాల్గొని తనదైన ముద్రను కలిగి ఉందని సంస్ధ ఎండి లక్ష్మినాధ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24 నుంచి ఏపీ, తెలంగాణలో కార్తీక మాస కార్యక్రమాలు