Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన మొట్టమొదటి విమానాశ్రయం : మంత్రి మేకపాటి

దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన మొట్టమొదటి విమానాశ్రయం : మంత్రి మేకపాటి
, శనివారం, 16 జనవరి 2021 (18:39 IST)
ఓర్వకల్ విమానాశ్రయానికి అనుమతులు రావడం శుభపరిణామమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతర కృషితో  విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. 

కేంద్ర పౌరవిమానయాన సంస్థ ఓర్వకల్ ఎయిర్ పోర్టులో రాకపోకలకు అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులివ్వడం వలన పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టడం ఖాయమన్నారు. మార్చి నెల నుంచీ రాకపోకలను ప్రారంభిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం 2020లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు.

ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ముఖ్యంగా విమానాశ్రయం అనుమతులు రావడంతో సుదూర ప్రయాణం సులువుగా సాగనుందన్నారు. విశాఖ సహా ఇతర ముఖ్య నగరాలకు త్వరగా చేరుకోవచ్చని మంత్రి మేకపాటి తెలిపారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తవడం ఒక ఎత్తైతే..దానికి వేగంగా అనుమతులు తీసుకురావడం మరో కీలక ముందడుగని మంత్రి అభివర్ణించారు.

ఎరొడ్రమ్ లైసెన్స్ అనుమతులు రావడం వెనుక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ సహా ప్రతి ఒక్కరి కృషినీ ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.

ఇప్పటికే నైట్ ల్యాండింగ్ సిస్టమ్, పైలట్ ట్రైనింగ్ సెంటర్ వంటి ఏర్పాట్లకూ కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా కీలకమైన లైసెన్స్ తీసుకురావడం పట్ల ఏపీఏడీసీ ఎండీ భరత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెస్ట్‌ సీఎం వైఎస్‌ జగన్‌, మరి కేసీఆర్ ఎక్కడ?