Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Advertiesment
pawan kalyan

ఐవీఆర్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:13 IST)
కర్టెసి-ట్విట్టర్
మొంథా తుఫాన్ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ నష్టాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందంటూ రైతులకు భరోసా ఇచ్చారు. మోకాలు లోతు బురదలో దిగారు. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల ఆవేదన విన్నారు. మీ కష్టంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి చేల వద్దకు వెళ్లారు. రైతులతో కలసి బురద చేలోకి దిగి పడిపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొట్ట దశలో ఉన్న వరి కంకులను పరిశీలించారు. అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూటమి ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు.
 
కృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీ కోట రమేష్ అనే రైతుకి చెందిన అయిదు ఎకరాల వరి పంట పూర్తిగా నేలకొరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా ఆ రైతు తనకు వచ్చిన కష్టాన్ని ఆయనకు వివరించారు. ఇప్పుడిప్పుడే వరి పొట్ట పాలు పోసుకుంటున్న దశలో తుపాను రావడం వల్ల పంట పూర్తిగా నాశనం అయిందని, ఎందుకూ పనికి రాకుండా పోయిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాపోయారు. మరో రెండు వారాలు ఆగితే పంట కోత దశకు వచ్చేదని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ గోవాడ నాగేశ్వరరావు అనే రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. నీటిలో తడిసిన ధాన్యపు గింజలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కు త్వరితగతిన పంట నష్టం నివేదికలు ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాలని పలువురు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తుపాను కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
 
అవనిగడ్డ మండల పరిధిలోని రామచంద్రపురం సమీపంలో తుపాను ధాటికి దెబ్బతిన్న అరటి తోటను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. శ్రీ విష్ణుమూర్తి అనే రైతుకి చెందిన అరటి తోట మొంథా తుపాను సమయంలో వీచిన పెనుగాలులకు పూర్తిగా నేల మట్టం అయినట్లు తెలుసుకున్నారు. సుమారు 1400 అరటి గెలలు పనికిరాకుండా పోయాయని రైతు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే సమయంలో రైతులకి మేలు చేసేలా ఆలోచన చేయాలని సూచించారు. దెబ్బ తిన్న అరట తోటలో ఎంత మేర పనికొస్తుంది? తిరిగి తోట బతుకుతుందా లేదా? మొత్తం తీసి తిరిగి పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించాలని తెలిపారు.
 
పంట నష్టంపై గణన చేపట్టే సమయంలో వ్యవసాయ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతుల పక్షాన నివేదికలు రూపొందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. జరిగిన నష్టానికి పక్కాగా అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా కోడూరు, అవనిగడ్డ మండలాల్లో సముద్రపు పోటుకు తీర ప్రాంత గ్రామాల్లో పంట నష్టం వాటిల్లుతోన్న విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి స్థానిక శాసన సభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు  తీసుకువచ్చారు. సముద్రం కరకట్టపై బ్రిటీష్ హయాంలో నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు దెబ్బతినడం కారణంగా పోటు సమయంలో సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోందని తెలిపారు. నూతన స్లూయిజ్ ల నిర్మాణం చేపడితే 5 వేల ఎకరాల్లో పంటలను కాపాడవచ్చని చెప్పారు. ఈ సమస్యపై సమగ్ర నివేదిక రూపొందించి సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?