రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు పెంచిన విద్యుత్ ఛార్జీల వివరాలు తెలుపుతున్న ఏపీఈఆర్సీ ఛైర్మన్ సి.వి. నాగార్జునరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెంచినట్లు ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు.
పెంచిన విద్యుత్ చార్జీలతో 1300 కోట్ల రూపాయల భారం పడుతుందని అయన చెప్పారు. ఈ భారమంతా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలపై మాత్రమే పడుతుందన్నారు.
అలాగే 500 యూనిట్ల పైబడి వాడిన వారికి 9 రూపాయల 5 పైసల నుంచి 9 రూపాయల 95 పైసలుగా టారిఫ్ నిర్ణయించినట్లు హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 14349.07 కోట్ల రూపాయల ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేశారని పేర్కొన్నారు.
వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2893.48కోట్ల ఆర్థికభారం తగ్గిస్తూ 2 పంపిణీ సంస్థలు నికరలోటు 10060.63కోట్ల రూపాయలుగా నిర్ధారించాయని తెలిపారు.
ఆదాయపన్ను చెల్లించని వ్యవసాయదారులు, బెల్లం రైతులు, గ్రామీణ నర్సరీలకు 8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించుటకు అంగీకారం కుదిరిందన్నారు.
ఇక నుంచి సబ్సిడీదారులకు బిల్లు వెనుక సబ్సిడీ వివరాలు పొందుపరచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 500యూనిట్లు పైబడి విద్యుత్ వాడకం ఉన్న 1.35లక్షల వినియోగదారులకు యూనిట్ ధర 9.05రూపాయల నుంచి 9.95రూపాయలకు పెంచినట్లు నాగార్జున రెడ్డి వివరించారు.
రైల్వేట్రాక్షన్ టారిఫ్ను 6.50 రూపాయల నుంచి 5.50 రూపాయలకు తగ్గించడం వల్ల 200కోట్ల భారం పడుతుందన్నారు. ఏపీలో 9500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని అయన స్పష్టం చేశారు.
ఈసారి వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన విద్యుత్కు పక్కా ప్రణాళిక వేసినట్లు చెప్పారు. లోటుపాట్లు ఉంటే వచ్చే సంవత్సరం సవరించుకుంటామని వివరించారు.