Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పిల్లాడి ఆత్మాభిమానానికి నిలువెత్తు సెల్యూట్.. కర్రోడు మనిషి కాడా?

తోటి బాలుర స్నేహం, సాన్నిహిత్యాల తోడుగా చదువు సాగించవలసిన ఆ పిల్లాడు మనసు విరిగి స్కూలుకు వెళ్లడానికి మొండికేస్తే.. బడికి ఎగ్గొట్టడానికి వేషాలు అని ఈజీగా అనేస్తుంటారు. ఆ పిల్లాడికి ఎంత బాధ కలిగితే, మనసు ఎంత గాయపడితే బడికి పోను అని చెప్పి ఉంటాడు.

Advertiesment
boy
హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (04:11 IST)
పత్రికల్లో మూడు నాలుగు కాలమ్‌లు నిడివిలో వచ్చే పొడవాటి రచనల కంటే ఒక చిన్న స్పేస్‌లో చిన్న బొమ్మ చూపే వాస్తవం మన సమాజంలోని వివక్షను ఎంతో హృద్యంగా ఎత్తిచూపగలుగుతుంది. తోటి బాలుర స్నేహం, సాన్నిహిత్యాల తోడుగా చదువు సాగించవలసిన ఆ పిల్లాడు మనసు విరిగి స్కూలుకు వెళ్లడానికి మొండికేస్తే.. బడికి ఎగ్గొట్టడానికి వేషాలు అని ఈజీగా అనేస్తుంటారు. ఆ పిల్లాడికి ఎంత బాధ కలిగితే, మనసు ఎంత గాయపడితే బడికి పోను అని చెప్పి ఉంటాడు. రంగును, జాతిని, కులాన్ని, మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని సాగే వివక్ష మన దేశంలో ఎంత తీవ్రంగా ఉంటోందంటే అది కనిపించని పోలీసోడి దెబ్బలాగా జీవితాంతం సలువుతుంటుంది. ఇంతకూ ఆ పిల్లాడు స్కూలు వద్దని ఎందుకు మొరాయించినట్లు?
 
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రనగర్‌కు చెందిన వీరేశ్ అనే ఒక పిల్లాడు తోటి విద్యార్థులు తనను కర్రోడా (సీమ భాషలో నల్లరంగు ఉన్నవాడు అని అర్థం) అని వెక్కిరిస్తున్నారని మనసు విరిగి బడికి పోనే పోనని మెుండికేశాడు. ఈ మాత్రందానికే బడికి పోవా, వెళ్లి తీరాల్సిందే అని అమ్మానాన్న అతడిని మందలించడంతో ఇంకా బాధెక్కువై పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదికి ఎక్కేశాడు. 30 అడుగుల ఎత్తున ఇనుపనిచ్చెనపై కూర్చుని దిగనంటే దిగనని మారాం చేశాడు. చివరికి విషయం తెలిసి పోలీసులు వచ్చి బుజ్జగించడంతో వీరేశ్ వెక్కుతూనే కిందికి దిగాడు. బడిలో పిల్లలను ఒకరినొకరు గేలి చేసుకోకుండా చూడాలని ప్రధానోపాధ్యాయుడికి పోలీసులు సూచించారు.
 
పల్లెటూళ్లలో రంగును ఎత్తి చూపటం సహజాతి సహజంగా జరుగుతుంటుంది. కులం పేరు చెప్పి అవమానించడం, ఒంటి రంగు పేరు చెప్పి గేలి చేయడం. దాదాపు ముప్పై, నలబై ఏళ్లుగా తెలుగు బడులలో సాగిపోతూనే ఉంది. తెల్లోడు, నల్లోడు, పుల్లోడు (తలవెంట్రుకలు పుల్లగా ఉంటే పెట్టే పేరు) ఇలాంటి పిలుపులు లేకుండా చిన్నప్పటి జీవితం సాగి ఉండదు. కానీ ఆ పిల్లవాడు తనకు అలా రంగు ముద్ర అంటించడం సహించలేకపోయాడు. ఒరే నల్లోడా, కర్రోడా అనే అవహేళన ప్రతి రోజూ తోటి పిల్లల నుంచి వస్తూ ఉంటే భరించలేకపోయాడు. ఏమిటీ అవమానం అని వాటర్ ట్యాంక్ సాక్షిగా తన బాధను ప్రపంచానికి చెప్పుకున్నాడు. వెనకటి తరాల్లో అప్పటి పిల్లలమైన మనకు చేతికానిదాన్ని అతడు చేసిచూపాడు.
 
అందుకే ఆ పిల్లాడి ఆత్మాభిమానానికి నిలువెత్తు సెల్యూట్ చేయాల్సిందే. నా రంగు మీకెందుకు? నన్ను మనిషిగా చూడటం మీకు చేతకాదా అని మన విద్యా వ్యవస్థ చెంప చెళ్లుమనిపించిన అతడి తిరుగుబాటును మనం పూర్తిగా సమర్థించవలసిందే.. ఏమో అతడిలోను మరో భవిష్యత్ పూలే, అంబేద్కర్ ఉన్నారేమో..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మహత్య చేసుకునే మొగుడూ కొడతాడు.. చివరి చూపుకు వస్తే అత్తింటి బంధువులూ కొడతారు..ఇదేం న్యాయం?