Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేతన్నల పక్షపాతి సీఎం జగనన్న- నేతన్న నేస్తమే అందుకు నిదర్శనం: వేణుగోపాలకృష్ణ

నేతన్నల పక్షపాతి సీఎం జగనన్న- నేతన్న నేస్తమే అందుకు నిదర్శనం: వేణుగోపాలకృష్ణ
, శుక్రవారం, 4 జూన్ 2021 (17:22 IST)
పాదయాత్ర సందర్భంగా చేనేతల సాధకబాధకాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చేనేతల పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.
 
ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావుతో కలిసి శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అద్దంపల్లిలోని మల్లేశ్వర, హసన్ బాదాలోని హసన్ బాదా చేనేత సహకార సంఘాలను మంత్రి గోపాలకృష్ణ సందర్శించారు. ఆయా సొసైటీల్లో తయారవుతున్న వెరైటీలను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పేదరికాన్ని పూర్తిగా అంతం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. లాక్ డౌన్ కారణంగా వస్త్ర ఉత్పత్తులు అమ్ముడు పోకపోవడంతో సహకార సంఘాల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.
 
ఈ విషయమై వాస్తవ పరిస్థితులను గమనించేందుకు చేనేత ప్రాంతాల్లో పర్యటించగా లాక్ డౌన్ వలన సహకార సంఘాల వద్ద పని లేకపోవడంతో నేత కార్మికులు ఉపాధికి దూరమై ఇతర వృత్తులలో కూలీ పనులకు వెళుతున్నట్టు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా తక్షణమే స్పందించారన్నారు. 
 
ఇదే విషయాన్ని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావుకు వివరించగా ఇక్కడి నేతన్నల స్థితిగతులను తెలుసుకునేందుకు విచ్చేసారని తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆప్కో ద్వారా వస్త్ర నిల్వలు కొనుగోలు చేస్తామని ఆప్కో చైర్మన్ మోహనరావు ప్రకటించడం చేనేత వర్గాల్లో భరోసా నింపిందన్నారు. చేనేత కార్మికులెవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సహకార సంఘాల వద్ద నిల్వ ఉన్న స్టాకును ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు
 
చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఏ ఒక్క చేనేత కార్మికుడు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో నేత కార్మికుడి ఏటా రూ.24 వేలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.
 
సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గతేడాది నుంచి బీసీ హాస్టళ్లు తెరుచుకోకపోవడంతో దుప్పట్ల సరఫరా లేక సొసైటీల వద్ద నిల్వలు అలాగే ఉండిపోయాయన్నారు. వాటిని ఆప్కో ద్వారా కొనుగోలు చేసి రెండు, మూడు నెలల్లో  హాస్టళ్లు తెరిచాక సరఫరా చేస్తామని, అవసరమైతే ఈ లోగా ఆప్కో షోరూముల ద్వారా విక్రయాలు జరుపుతామని తెలిపారు.
 
ప్రభుత్వం నుంచి త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ విడుదలయ్యే విధంగా మంత్రి వేణుగోపాలకృష్ణ కృషి చేయాలని కోరారు.  భవిష్యత్తులో ఆప్కో ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి టర్నోవర్ పెంచుతామని, షోరూములను మరింతగా విస్తరిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో లక్ష మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మోహనరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో జీఎం ఎల్.రమేష్ బాబు, డీఎంఓ రామకృష్ణ, ఎస్ఎమ్ఓ సుదర్శన్, ఏడీ కృపవరం తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలోని మంచిర్యాలలో ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సమాచార కేంద్రం