స్థానిక సంస్థల్లో పన్నుల పెంపు అధికారం రాష్ట్ర పరిధిలోని అంశమా? లేక కేంద్ర పరిధిలోని అంశమా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'మునిసిపల్ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం పన్ను పెంపుపై నోరు మెదపలేదు. ఎన్నికల తర్వాత పన్నులు పెంచింది. ప్రజలను మోసం చేసింది. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడి మల్లన్న అన్న తీరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
మరోవైపు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పన్నులు పెంచుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది' అని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 'కేంద్ర సర్కారు పన్నులు పెంచాలని చెబితే అన్ని రాష్ట్రాల్లోనూ పెరగాలి కదా? మరి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెరగలేదు? స్థానిక సంస్థల పరిధిలో పన్నుల పెంపకం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు కదా?
అంతేగాక విపక్షాలే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు' అని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఏపీలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు.
ప్రజలకు డబ్బులు ఓ చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కునే చర్యలకు పాల్పడుతోంది. పన్నుల భారంపై బీజేపీ రాష్ట్ర నేతలు పోరాడతారు' అని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు.