తెలుగు భాషకు మరింత గౌరవం రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులైన జీవోలు తెలుగులోనూ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మొట్టమొదటి తెలుగు జీవో విడుదల కాగా, ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలుగు భాషపై మరింత ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇది తెలుగు భాష భవిష్యత్తుపై ప్రాముఖ్యత కోల్పోయేలా చేస్తుందని అప్పట్లో అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఏపీ సర్కారు తొలిసారిగా తెలుగులో జీవో విడుదల చేయడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో జీవోలు రావడంతో ప్రజలకు అవగాహన పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ప్రభుత్వం ఒక జీవోను ఇంగ్లీషులో విడుదల చేసిన రెండు రోజులకు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వ పనితీరు పైన ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.