నావల్లే తెలంగాణ వచ్చిందా.. కేసీఆర్ తెచ్చాడా? ఎవరు చెప్పారంటున్న జైపాల్ రెడ్డి
రాష్ట్ర విభజన తనవల్లే జరిగిందని వస్తున్న విమర్శలను, నిందారోపణలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర విభజన తనవల్లే జరిగిందని వస్తున్న విమర్శలను, నిందారోపణలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లోక్‌సభలో ఫిబ్రవరి 18న తాను పూనుకోకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్న మాటను తనకు గౌరవంగానే భావిస్తానని కాని అంతమాత్రాన తెలంగాణ జైపాల్ రెడ్డి వల్లో, కేసీఆర్ వల్లో వచ్చిందంటే ఒప్పుకోనని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక అనివార్యత. ఇన్ని దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న వేరు భావనలను ఎంతవరకు మనం అణిచివేయగలం అని ప్రశ్నించారు. పైగా కేంద్రస్థాయిలో రాజకీయ పార్టీల్లో మెజారిటీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు మైనారిటీలో ఉన్నవారికి దాన్ని వ్యతిరేకించే శక్తి ఉండదన్నారు.
1973లోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేసి ఉంటే సీమాంధ్ర ప్రాంతంలో ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఆనాటికి సీమాంద్ర మిత్రులకు హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు లేవు. రెండోది.. హైదరాబాద్ నగరంపై ఇంత మమకారాన్ని వారు ఆనాడు పెంచుకోలేదు. ఒక భాషా ప్రాంత రాష్ట్రాన్ని విడగొడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలాగే అడుగుతాయని ఇందిరాగాంధీ భావించి ఉంటారు అని జైపాల్ రెడ్డి వివరించారు.
పైగా తెలంగాణను తానో, కేసీఆరో తెచ్చాడని వ్యక్తులకు ఆపాదించడం చరిత్రకు విరుద్ధమన్నారు జైపాల్. అనేక శక్తుల పోరాట సమ్మేళనమే ఏ ఉద్యమ విజయానికైనా గీటురాయిగా ఉంటుందని, దీట్లో పలానా వ్యక్తి అంటూ ఎలాంటి ప్రాధాన్యత ఉండదని చెప్పారు. కానీ 14 ఏళ్లపాటు మలి దశ ఉద్యమాన్ని తన భుజానపై వేసుకుని పట్టు విడవకుండా పోరాడినందువల్లే కేసీఆర్‌కు అధిక గుర్తింపు వచ్చిందని, జనం నమ్మి ఆయన పార్టీకి ఓటెయ్యడానికి కూడా ఇదే కారణమని జైపాల్ విశ్లేషించారు.