Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవ మృగాలు తిరుగుతున్నాయ్.. మహిళలకు రాత్రిపూట డ్యూటీలు వద్దు : కేసీఆర్

మానవ మృగాలు తిరుగుతున్నాయ్.. మహిళలకు రాత్రిపూట డ్యూటీలు వద్దు : కేసీఆర్
, సోమవారం, 2 డిశెంబరు 2019 (12:41 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో జరిగన పశువైద్యురాలు దిశ అత్యాచారం, హత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయనీ అందువల్ల మహిళలకు రాత్రి పూట డ్యూటీలు వేయొద్దని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశమైన విషయం తెల్సిందే. తన కార్యాలయంలో వారికి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దిశా హత్య కేసుపై స్పందించారు. ఇది దారుణమైన, అమానుషమైన సంఘటన అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని అధికారులకు సూచించారు. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. చట్టాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి వరుస ట్వీట్లు చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మార్పులు తేవాలని, అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని, ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. 
 
ఈ సందర్భంగా నిర్భయపై అత్యాచార ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటన జరిగి ఏడేళ్లయినా నిందితులకు ఉరిశిక్ష పడలేదని అన్నారు. ఇటీవల తొమ్మిది నెలల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధించాలని దిగువ కోర్టు తీర్పిస్తే, ఆ శిక్షను హైకోర్టు తగ్గిస్తూ జీవితఖైదుగా మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.
 
ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, హత్య చేశారని, హంతకులు దొరికారు కానీ, బాధితురాలికి న్యాయం ఎలా చేద్దామని ప్రశ్నించారు. న్యాయం జరగడంలో ఆలస్యమైందంటే న్యాయం జరగనట్టే అని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక, ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపై ఓ రోజు మొత్తం చర్చించి, ఐపీసీ, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాలని కోరారు. బాధపడుతున్న, నిస్సహాయంగా ఉన్న పౌరుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానంటూ మోడీకి చేసిన ట్వీట్లలో కేటీఆర్ పేర్కొన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’