తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. ఆయన మాట్లాడుతూ... కరోనాతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బాధితులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం అత్యంత ఘోరం.
కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమై లక్షలాది మంది అవస్థలు పడుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. అయినా.. ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు.
తాజాగా రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన ఘటనలోని వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం దాచేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రజల్ని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
కమిటీలో సభ్యులు:
1. జి.నరసింహయాదవ్, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు
2. ఎన్.అమర్ నాథ్ రెడ్డి, మాజీమంత్రి
3. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,
4.ఎం.సుగుణమ్మ, మాజీ ఎమ్మల్యే.
5. పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు,
6. బత్యాల చెంగల్రాయుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
7. మబ్బు దేవనారాయణ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి.