Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాక్సినేషన్ లో వెనుకబడ్డాం... బూస్టర్ డోస్ ఊసే లేదు!

వ్యాక్సినేషన్ లో వెనుకబడ్డాం... బూస్టర్ డోస్ ఊసే లేదు!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:57 IST)
డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ కంటే ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కోవిడ్ రెండు దశలను ఎదుర్కోవడంలో  ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద‌ని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమ‌ర్శించారు. సిఎం ప్యాలెస్ కు పరిమితం కాకుండా, ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాల‌న్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఏపీ వ్యాక్సినేషన్ లో బాగా వెనుకబడి ఉంద‌ని, రాష్ట్రంలో రెండు డోసులు కలిపి 6 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చార‌ని అన్నారు. 
 
 
కోవిద్ మరణాల విషయంలో  జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించింద‌న్నారు. రాష్ట్రంలో అధికారికంగా నమోదైన  కోవిడ్ మరణాల కంటే (14,431) రెట్టింపు క్లెయిమ్ లు (28,468) ఎక్స్ గ్రేషియా కోసం వచ్చినట్లు  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్వి సంజీవ్ కుమార్ జిందాల్ సుప్రీం కోర్టుకు సమర్పించిన  అఫిడవిట్ లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ.50వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అందజేయకపోవడం విచారకరమ‌న్నారు. రెండు డోసులు పూర్తి చేసుకున్నవారికి ఇచ్చే బూస్టర్ డోసుపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచనే చేయడంలేద‌న్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, ఐసీయూ పడకల ఏర్పాటు, వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారం తక్షణమే ప్రభుత్వం ప్రజల ముందుంచాల‌న్నారు. 
 
 
ఇప్పుడైనా ముందుగా మేల్కొని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, ఐసీయూ బెడ్స్, మందులు వంటి అన్ని ఏర్పాట్లపై ముందుగా సమీక్ష చేసుకుని సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంద‌న్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇప్పటి వరకూ ఒమిక్రాన్ గురించి ఎక్కడా సమీక్ష చేసినట్లు తాము చూడలేద‌ని, అలసత్వం ప్రదర్శించకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాల‌న్నారు.
 
 
కనీసం సెకెండ్ వేవ్ అనుభవాల దృష్ట్యా అయినా ఒమిక్రాన్ పట్ల సీరియస్ గా స్పందించాల్సిన అవసరం వుంద‌న్నారు. తక్షణమే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం నుండి రావాల్సిన వ్యాక్సినేషన్, మందులు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని ప‌ట్టాభి కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలి-పులిః అహ్మదాబాద్ జూలో సింహనికి హీటర్