Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృత్యువేగంతో దూసుకెళ్లారు.. ప్రాణాలతో చెలగాటమాడారు.. తనువే చాలించారు...

కారులో చిక్కుకున్న శరీరాలను బయటకు లాగడానికి రెండు గంటల సమయం పట్టిందంటే.. ఆ కారును వారు ఎంత ప్రమాదానికి గురి చేసి ఉంటారో బోధపడుతుంది. దూసుకెళుతున్న కారు మెట్రో రైలు పిల్లర్‌ను డీకొని పదడుగుల ఎత్తు ఎగిరి వెనక్కి పడిందంటే అది మృత్యువేగమేనని బోధపడుతుంది.

మృత్యువేగంతో దూసుకెళ్లారు.. ప్రాణాలతో చెలగాటమాడారు.. తనువే చాలించారు...
హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (07:13 IST)
కారులో చిక్కుకున్న శరీరాలను బయటకు లాగడానికి రెండు గంటల సమయం పట్టిందంటే.. ఆ కారును వారు ఎంత ప్రమాదానికి గురి చేసి ఉంటారో బోధపడుతుంది. దూసుకెళుతున్న కారు మెట్రో రైలు పిల్లర్‌ను డీకొని పదడుగుల ఎత్తు ఎగిరి వెనక్కి పడిందంటే అది మృత్యువేగమేనని బోధపడుతుంది. రైడ్ కోసం వెళ్లి వర్షం వస్తున్నా వెనక్కి వెళ్లిపోకుండా వేచి చూసి తిరిగి భారీ వర్షంతో నిండిన హైదరాబాద్ రోడ్లపై తెల్లవారు జామున మొండిగా ముందుకెళ్లారంటే.. వారు ప్రాణాలకు తెగించారనే అర్థమవుతుంది.

ఈ జనవరి నుంచి ఏప్రిల్ లోపల మూడుసార్లు హైదరాబాద్‌లోనే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి స్పీడ్ గన్‌కు చిక్కారంటే వాళ్లకు చట్టంమన్నా, తమ ప్రాణాలన్నా, రోడ్డుపై ఇతరుల జీవితాలన్నా ఏమాత్రం లెక్కలేదని, బోధపడుతుంది. ఇప్పుడు ఎవ్వరు ఎంత ఏడ్చి లాభం? కన్న తండ్రి లండన్ నుంచి ఆగమేఘాల మీద పరుగెత్తి ఏం ప్రయోజనం. పెద్దల భయం కాదు.. తమ ప్రాణాల మీద తమకు భయం లేనివారు తమ జీవితాలకు తామే చరమగీతం పాడుకున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడి నిషిత్‌ మృతికి అతివేగమే కారణమని తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో  కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిషిత్‌ తన స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మతో కలిసి గతరాత్రి బెంజ్‌ కారులో రైడ్‌కు వెళ్లాడు. అయితే హైదరాబాద్‌లో గతరాత్రి ఈదురు గాలులతో భారీవర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో వారిద్దరూ వర్షం తెరిపి ఇచ్చేవరకూ కొద్దిసేపు ఓ స్నేహితుడి ఇంట్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం స్నేహితులు ఇద్దరూ కారులో బయల్దేరారని, అయితే జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం.
 
తెల్లవారుజామున రెండు, రెండున్నర సమయం‍లో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతివేగంగా పిల్లర్‌ను ఢీకొనడంతో కారు ముందుభాగం మధ్యలోకి వచ్చేయడంతో పాటు బెలూన్స్‌ కూడా పగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో వారిద్దరూ చిక్కకుపోవడంతో ఛాతీ, పొట్ట భాగంగా చిధ్రమైనట్లు తెలిపారు. వారిని కారులో నుంచి బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు చెబుతున్నారు.  
 
అలాగే  ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. నిషిత్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మలో కొద్దిగా కదలికలు కనిపించాయని, దీంతో 108కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వారిద్దర్ని అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డబ్బు జ్వరం చేసినవారు, మనుషులన్నా, చట్టాలన్నా, చివరకు తమ జీవితాలన్నా లెక్కలేనివారు రోడ్లమీద మృత్యుబేహారుల్లాగా ఇతరులను వాహనాలతో గుద్ది చంపడానికి, లేక తమకుతామే ఓవర్ స్పీడ్‌ రోగానికి గురై చావడానికి సిద్ధమైపోయారని కొన్ని డజన్ల కొద్ది ఘటనలు గత రెండేళ్లుగా నిలువెత్తు ఉదాహరణలై నిలుస్తున్నాయి? 
 
ఒక్కటి మాత్రం నిజం.. సంపన్నులు, నడమంత్రపు సిరి పట్టినవారు తమ పిల్లలను గాలికి కాదు రోడ్లకు వదిలేశారు. వాళ్లేం చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నా, చట్టరాహిత్యం బారిన పడుతున్నా సంపదలు పోగు చేసుకోవడం యావలో పడి వదిలేశారు. పూర్తిగా వదిలేశారు. తల్లిదండ్రుల అరాచకానికి, పిల్లల పట్ల పట్టింపు లేనితనానికి చివరకు మృత్యువు చరమగీతం పాడుతోంది. పిల్లలను చిన్న వయసులోనే కంపెనీలకు, విద్యా సంస్థలకు డైరెక్టర్లుగా చేస్తున్నవారు.. ఆ పిల్లల వ్యక్తిగత జీవితాన్ని, వారి అలవాట్లను, వ్యసనాలను, మృత్యువేగం పట్ల వారి మక్కువను నడిరాత్రి, అపరాత్రి రోడ్లమీదికి వచ్చే వారి బలాదూర్ తత్వాన్ని గాలికి వదిలేశారు.
 
అందుకు బలవుతున్నది మొన్న అజారుద్దీన్ కుమారుడు, నిన్న కోమటి రెడ్డి కుమారుడు, ఇవ్వాళ ఏపీ మంత్రి నారాయణ కుమారుడు.. రేపు మరెవ్వరి కుమారుడో తప్పకుండా ఇదే దారిన పయనిస్తూనే ఉంటారు. ఫలితం అనుభవిస్తూనే ఉంటారు. ఇది ఆగ్రహంతోనో, ఒళ్లు మండో చెపుతున్నది కాదు. సంపన్నుల సంతానంపై పొంచి ఉన్న మృత్యువాస్తవాన్ని వాసన చూస్తూ  చెబుతున్న మాట. మేలుకోవలసింది ఆ పిల్లలు కాదు.. వారిని నడిరాత్రుళ్లు రోడ్లమీదికి వదులుతున్న తల్లిదండ్రులే.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేనిపట్లా భయం లేకపోవడమే సంపన్నుల పిల్లల మరణాలకు కారణమా?