ఒక్క పైసా అదనంగా వద్దు.. విభజన చట్టాన్నే అమలు చేయండి : సుజనా చౌదరి
విభజన వల్ల తీవ్రంగా నష్టంపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అదనంగా వద్దనీ విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తు.చ తప్పకుండా అమలుచేయాలని కోరుతున్నామని కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చా
విభజన వల్ల తీవ్రంగా నష్టంపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అదనంగా వద్దనీ విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తు.చ తప్పకుండా అమలుచేయాలని కోరుతున్నామని కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.
తిరుపతి కేంద్రం టీడీపీ ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో ఆ పార్టీ జాతీయ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని ఆ పార్టీ నేతలు తూర్పారబడుతున్నారు. ముఖ్యంగా, సభలో ప్రధాని మోడీ ప్రసంగాల వీడియోలను చూపిస్తూ బీజేపీ వైఖరిని ఎండగట్టనున్నారు.
ఈ సభలో సీనియర్ నేత సుజనా చౌదరి స్పందిస్తూ, విభజన చట్టంలో పెట్టింది మాత్రమే చేయాలని తాము అడుగుతున్నామని, ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అడగడం లేదన్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి ఇప్పటికే చాలా చేశామని చెప్పుకుంటున్నారన్నారు. మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని ఆనాడు మిన్నకుండిపోయామన్నారు.
అయితే, కేంద్రం అదీ కూడా ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిందని సుజనా చౌదరి ఆరోపించారు. ఎన్డీఏపై పోరాటాన్ని మొదటి నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వచ్చేవన్నారు. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. చాలా ఓపిక పట్టి చివరికి నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశామని గుర్తుచేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర సర్కారుని నిలదీసి అడిగానని సుజనా చౌదరి అన్నారు.