Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ తిక్కవ్యక్తి.. ప్రత్యేక సీమకు టెంకాయ కొట్టిన జగన్ : జేసీ

Advertiesment
JC Diwakar Reddy
, బుధవారం, 22 జనవరి 2020 (14:54 IST)
ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టారనీ, మరో యేడాది లేదా ఐదేళ్ళలో అయినా ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు ఖాయమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిక్క వ్యక్తి, ఆయన చెప్పేంత వరకు ఎవరికీ ఏది తెలియదని అనుకుంటారని ఎద్దేవా చేశారు. 
 
వైకాపా సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. అయితే, తమకు కేంద్రంతో పాటు.. న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
ముఖ్యంగా, ఏపీలో సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణని అవలంబిస్తోందని చెప్పారు. సచివాలయంతో సామాన్య ప్రజలకు పని లేదని అపరచాణుక్యులైన మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.
 
అలాగే, రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్నన వారిలో ఆడ, మగ అనే తేడా లేకుండా పోలీసులు చావబాదుతున్నారని... బ్రిటీష్ వారి హయాంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. ప్రత్యేక రాయలసీమకు జగన్ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారని... రెండేళ్లకో, ఐదేళ్లకో ప్రత్యేక రాయలసీమ వచ్చి తీరాల్సిందేనని చెప్పారు. జగన్ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటున్నారని... ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు. వేసుకున్న బట్టలు విప్పేసి తిరుగుతామంటే ఎవరూ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. 
 
"నాకు తెలిసి ఎక్కడా కూడా చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు లేవు. ఏందో ఇక్కడ మనోళ్లు జగన్‌కు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. శాసనసభను అందరూ గౌరవించాలి. ఆయన శాసించినా సులభంగా రాష్ట్రంలో మూడు రాజధానులు జరగవు. హైకోర్టు కర్నూలుకొస్తే ఏం లాభం? మా జతగాళ్ల రెండు లాడ్జిలు ఫుల్‌ అవుతాయి తప్పా మరేమీ ఉండదు. రాజధానికి బ్రెయిన్‌ లాంటిది సచివాలయం. బ్రెయిన్‌ లేకపోతే ఏం ఉపయోగం? అందుకే జగన్‌ తెలివిగా అమరావతే రాజధానిగా పెడుతారు. బ్రెయిన్‌ మాత్రం విశాఖకు తీసుకెళ్తున్నారు. 
 
క్రమశిక్షణ, సిగ్గు, మానం, అభిమానం ఆయనకు లేవు. దొందూ... దొందే? మా టీడీపీ వాళ్లు ముందుగా కొన్నెకరాలు కొన్నారు. ఆ లిస్టును ఇప్పుడు ప్రకటించారు. వీళ్లిప్పుడు దోచుకోవాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పవన్‌ ఓ తిక్కాయన. ప్రధాని నరేంద్ర మోడీకి మూడు రాజధానులు విషయం చెప్తానంటున్నాడు. మోడీకి అన్నీ తెలుసు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. కేంద్రం అన్నీ చూస్తూనే ఉంది. కళ్లు ఎప్పుడు తెరుస్తుందో చూడాలి' అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టం లేదు.. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ర్యాలీలు - జగన్ ఫోటోలకు పాలాభిషేకం