తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. అయితే మహానాడుకు వేదిక లేదు. ఎందుకంటే, ఈ దఫా నిర్వహిస్తున్నది.. డిజిటల్ మహానాడు. గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి జూమ్ యాప్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు డిజిటల్ పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు బుధవారం ఓ పిలుపుకూడా ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన వరుసగా మూడు ట్వీట్లు చేశారు.
"సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎలాంటి సమస్యలకైనా ఒక పరిష్కారం చూపుతుందనే నా నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది. లాక్డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే డిజిటల్ సోషలైజేషన్ దిశగా మనం వెళ్ళామంటే దానికి కారణం సాంకేతికత. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020 కూడా అలాంటిదే"
"ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడుకు ఈసారి లాక్డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయి. అయితేనేం జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపింది. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం మన మహానాడు 2020".
"తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా మీ మొబైల్ లేదా ట్యాబులలో జూమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మే 27, 28 తేదీలలో జరిగే ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనండి. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ మహానాడుని కూడా విజయవంతం చేయండి" అంటూ చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.