నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశానని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రాజధానిని నిర్మించాలనే తపనతో అమరావతిని సృష్టించానని తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు పర్యటించిన చంద్రబాబు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు అప్పగించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా అమరావతిలోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునేలా రాజధానిని నిర్మించినట్లు తెలిపారు.
తాను పులివెందులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే కుప్పంకు నీళ్లు తీసుకెళ్తానని చెప్పానని అనుకున్నట్లుగానే కుప్పంకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదనని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ, ఇండస్ట్రీయల్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించానని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతోపాటు తరగని సంపద సృష్టించినట్లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గం ప్రజలు తనను గుండెల్లోపెట్టుకుని చూస్తున్నారని తెలిపారు. ఎన్ని జన్మలెత్తినా కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపొటములు సహజమన్న చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలు సాధనకు ప్రజలపక్షాన పోరాటం చేస్తానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వారికి అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.