చిత్తూరు జిల్లా అంగళ్లు వీధిలో అల్లర్లు ఒక పథకం ప్రకారం చేసి, తన హత్యకు కుట్ర పన్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన బుధవారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ, మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అంగళ్లు వీధిలో జరిగిన అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాలని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తంబళ్లిపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ, ఇపుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటివి ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి అదేశాలతోనే నన్ను తిరగనివ్వడం లేదు. ప్రజల తరపున పోరాడకుండా అడ్డుకుంటున్నారు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఒక పథకం ప్రకారం తనను అడ్డుకుని, హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఎక్కడికెళ్లినా తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడులకు భయపడి నేను పారిపోవాలా? ఎన్.ఎస్.జి భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక ఆర్థమేముంది? వైకాపా ప్రభుత్వం చేసే దోపిడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను అని ఆయన ప్రకటించారు.