Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాటలకు చేతలకు పొంతనే కాదు ముందుచూపు లేని బడ్జెట్ ‌: చంద్రబాబు

మాటలకు చేతలకు పొంతనే కాదు ముందుచూపు లేని బడ్జెట్ ‌: చంద్రబాబు
, శనివారం, 13 జులై 2019 (06:31 IST)
శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైకాపా ప్రభుత్వం ముందుచూపులేని బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. వైకాపా మాటలకు, చేతలకు పొంతన లేదనేందుకు బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమన్నారు. శ్వేతపత్రంలో ఒకలా చెబుతారు.. బడ్జెట్‌లో మరోలా పేర్కొంటారని విమర్శించారు. 
 
2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6వేలే ఎక్కువ.. ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం తెదేపా ప్రభుత్వ ఘనత కాదా? అని ప్రశ్నించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టులకు కోతలు పెట్టి ప్రగతికి గండికొట్టారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో 22శాతం కోత పెట్టారన్నారు. 
 
పొరుగు రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే దృష్టిపెట్టారని ఆక్షేపించారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు అవసరమైతే రూ.100 కోట్లే ఇచ్చారన్నారు. బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారని.. 139 కార్పొరేషన్లు అని చెప్పి.. వాటికి కేటాయింపులపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. 
ఆర్టీసీ విలీనంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు.
 
'డ్వాక్రా మహిళలకు రూ.1788 కోట్లే కేటాయించారు. డ్వాక్రా రుణాల రద్దు, మహిళలకు రూ.75వేల హామీలకు కేటాయింపులు లేవు. వచ్చే ఏడాది నుంచి చేస్తామని ఈ బడ్జెట్‌లో చెప్పడం కూడా మరో మోసం. అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల బడిగా మార్చారు. బడ్జెట్‌లో 43లక్షల మంది తల్లులకే లబ్ధి అన్నారు. నిధులు లేకుండా ఐదేళ్లలో 25లక్షల ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం? 
 
మద్యాన్ని ప్రభుత్వమే ఎలా విక్రయిస్తుందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ దశలవారీ నిషేధం ముసుగు ఏమిటి? మద్యం కంపెనీల నుంచి ముడుపుల కోసమేనా నేరుగా మద్యం విక్రయం? రాజధానికి రూ.500 కోట్లు, కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250కోట్లతో పనులెలా చేస్తారు? 
 
స్థిరాస్తిరంగం హైదరాబాద్‌ తరలిపోయింది. లక్షల మంది కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయింపులు లేవు' అంటూ విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా? వేమూరి ఆనంద్ సూర్య