ప్రముఖ చిత్రకారుడు, టాలీవుడ్ దర్శకుడు బాపు మృతిపై తానా సంతాపం ప్రకటించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తానా తొలిరోజుల నుంచి, బాపుకు తానాతో ప్రగాఢ అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. 1985లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తానా మహాసభలలో ముఖ్య అతిథిగా తానా ఆయనను గౌరవించిందని తెలిపారు.
బాపు బొమ్మ, రమణ రచనల మొదటి ప్రచురణల స్వర్ణోత్సవాన్ని 1995లో దశమ తానా మహాసభలలో (చికాగో) తానా ఘనంగా నిర్వహించటం తెలుగుదేశంలో అందరికీ స్ఫూర్తి కలిగించిందని, ఆ స్వర్ణోత్సవాల్లో భాగంగా బాపు-రమణలపై తానా ప్రత్యేకంగా ప్రచురించిన, బొమ్మా-బొరుసు అనే పుస్తకం బహుళ ప్రచారం పొందిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యంగా బాపు నిర్యాణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, కానీ తెలుగువారి మనసుల్లో, తెలుగు సాంస్కృతిక ప్రపంచంలో ఆయన స్థానం శాశ్వతమైనది. బాపు కుటుంబసభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులకు తానా తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.