ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని మంటలు ఇంకా ఆరలేదు. ఉద్యమం మొదలై ఏడాదిన్నర గడుస్తున్నా, ఇంకా రాజధాని రైతులు తమ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఉద్యమ సెగ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తగిలింది.
శనివారం మందడంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చారు. మార్గమధ్యంలో ఆమెను దళిత మహిళలు, రైతులు అడ్డుకున్నారు. దళిత రైతు పులిచిన్న దీనికి సారధ్యం వహించాడని అనుమానించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవి వెళ్ళే వరకు అడ్డుకుని, ఆమె వెళ్ళాక పోలీసులు వదిలిపెట్టారు. అస్సిన్డ్ కౌలు, అమరావతి పింఛను కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇద్దమనుకుంటే అరెస్ట్ లు చేస్తారా? మా గోడు వినరా? అంటూ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో తిరగాలంటేనే ప్రజాప్రతినిధులకు హడల్ గా ఉంటోంది. ఎక్కడకు వెళ్లినా అమరావతి రైతులు వినతి పత్రాలు పట్టుకుని న్యాయం చేయమని వెంటపడుతున్నారు. దీనితో ప్రజాప్రతినిధులు తలలు పట్టకుంటున్నారు.