Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమతులు లేకుండా మీ ఇష్టానికి ప్రాజెక్టులు కడతారా.. తెలంగాణకు సుప్రీం ప్రశ్న

Advertiesment
supreme court
, శనివారం, 7 మే 2016 (08:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తున్నారంటూ నిలదీసింది. ఎగువ రాష్ట్రంగా ఉన్న మీరు మీ ఇష్ట ప్రకారం.. మీకు నచ్చినట్టుగా ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువ రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించింది. 
 
రాష్ట్రంలో డిండి విస్తరణ, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు అనుమతులు లేవని, వీటి నిర్మాణ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ యేడాది ఫిబ్రవరిలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రోహిన్టన్‌ నారిమన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులనూ చేపట్టిందని, శంకుస్థాపన కూడా చేసిందని తెలిపారు. తమకు నష్టం చేసే ఆ ప్రాజెక్టులకు అడ్డుపడటం లేదని, అనుమతులు తీసుకోవాలని కోరుతున్నామని వివరించారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన జస్టిస్‌ రోహిన్టన్‌ నారిమన్‌ స్పందిస్తూ 'అనుమతులు లేకుండా ఎలా కడుతున్నారు? అనుమతి పొందడానికి ఎవరు అడ్డుపడుతున్నారు?' అని తెలంగాణను ప్రశ్నించారు. 
 
దీంతో తెలంగాణ న్యాయవాది బైద్యనాథన్‌, ఏఏజీ రామచంద్రరావు బదులిస్తూ.. ఆ ప్రాజెక్టులు కొత్తవి కాదని, సమైక్య రాష్ట్రంలో మొదలుపెట్టినవేనని చెప్పారు. కొంత సమయమిస్తే సవివరంగా కౌంటర్‌ దాఖలు చేస్తామని అభ్యర్థించారు. కాగా, తుది విచారణను జూలై 20కి వాయిదా వేస్తున్నామని, ఎవరు కోరినా మరో వాయిదా ఉండదని జస్టిస్‌ కురియన్‌ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బిడ్డలను బాగా చూసుకో తమ్ముడూ... సెల్ఫీలో కన్నీటి వినతి.. ఆపై వివాహిత ఆత్మహత్య