Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంజాయి సేవించి, లేడీస్ హాస్టల్లో ప్రవేశించి.. ఏయూ పరువుతీసిన విద్యార్థులు

ఇటీవలే జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రచారార్భాటాలను గేలి చేస్తూ విశాఖపట్నం విద్యార్థులు ఆంధ్రాయూనివర్శిటీ పరువును నిలువునా గంగలో కలిపేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు హద్దుమీరి విద్యాలయానికే తలవంపులు తెచ్చారు. పూటుగా గ

Advertiesment
andhra university
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (22:58 IST)
ఇటీవలే జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రచారార్భాటాలను గేలి చేస్తూ విశాఖపట్నం విద్యార్థులు ఆంధ్రాయూనివర్శిటీ  పరువును నిలువునా గంగలో కలిపేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు హద్దుమీరి విద్యాలయానికే తలవంపులు తెచ్చారు. పూటుగా గంజాయి సేవించి వీరంగం చేశారు. మత్తెక్కిన మైకంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. తూగుతూ, ఊగుతూ సరాసరి లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించారు. అక్కడున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు.

ఏయూ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి, అధ్యాపక వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. అప్రమత్తమైన యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న కొంతమంది విద్యార్థులు గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు.
 

వీరిలో నలుగురు విద్యార్థులు తాముంటున్న హాస్టల్‌ వద్ద శుక్రవారం రాత్రి పూటుగా గంజాయి సేవించారు. బయట ఉన్న కొందరితో అరగంట పాటు వాగ్వాదానికి దిగారు. మత్తు నషాళానికి ఎక్కిన తర్వాత ఒళ్లు మరిచారు. సమీపంలో ఉన్న లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించారు. ఒకరిద్దరైతే తమ ఒంటిపై ఉన్న దుస్తులను కూడా తొలగించుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నా ఆగకుండా దూసుకెళ్లారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థినుల వైపునకు వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా స్పృహ లేకుండా నానా హంగామా చేశారు. పావుగంట పాటు వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు సెక్యూరిటీ సిబ్బంది నిలువరించి వారిని అతికష్టంపై అక్కడ నుంచి బయటకు గెంటివేశారు. మత్తులో తూగుతూ అదుపు తప్పిన వీరిని చూసి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు భయకంపితులయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చొరవతో బయటకు పంపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
 
ఏయూలో కొంతమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మద్యానికి అలవాటుపడ్డారు. తాము ఉంటున్న హాస్టల్‌ గదుల్లో నిర్భయంగా మద్యం సేవిస్తున్నారు. హాస్టళ్ల పరిసరాల్లో ఎక్కడబడితే అక్కడ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తూనే ఉంటున్నాయి. అయినా హాస్టళ్ల వార్డెన్లు, ఏయూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రాత్రి పూట బయట వ్యక్తులు కూడా మద్యంతో పాటు గంజాయి సేవిస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా గంజాయి పీల్చడానికి అలవాటు పడ్డారు. ఇటీవల కాలంలో అది మరింత అధికమవుతోంది. ఫలితంగా ఇప్పుడు హద్దులు మీరి వీరంగం చేయడం, లేడీస్‌ హాస్టళ్లలోకి ప్రవేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
 
మత్తులో తూగి అసభ్యకరంగా ప్రవర్తించిన నలుగురు విద్యార్థులను ఏయూ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. తక్షణమే వారిని సస్పెండ్‌ చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించినట్టు ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు చెప్పారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విషయాన్ని వారికి తెలియజేశామన్నారు. ఏయూలో అసాంఘిక కార్యకలాపాలను, గంజాయి, మద్యం సేవనాన్ని సహించబోమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీలో ఏం జరిగిందో నివేదిక పంపండి: బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌!