ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ ప్రతిభకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరోయ పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యాడు. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా మెచ్చుకుని అతని ప్రతిభను గుర్తించడంతో పాటు.. లక్ష రూపాయల నగదు బహుమతిని కూడా ప్రదానం చేశాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఏం చేశారన్నదే కదా మీ సందేహం. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించాడు.
వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్.. అతణ్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని
మాట్లాడారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు.
పైగా, ఆ సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. సిద్ధూది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామం. తన ఇంటి నుంచి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ సిద్ధూ.. స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్‌కు రూపకల్పన చేశాడు. ఈ సైకిల్‌ను మూడు గంటలు పాటు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగలదని సిద్ధూ... పవన్‌కు తెలిపాడు.