ప‌్రజలకోసం నిజాయితీగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రజల అభిమానం ఆశీస్సులు అందించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ మాట నిలబెట్టుకునేలా పనిచేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు వచ్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. గజపతినగరం మండంల మరుపల్లిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
గ్రామీణులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క సి.ఎం. జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమయ్యిందన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు తదితర అన్ని వర్గాలకు పథకాలను రూపొందించి నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
స్వయంశక్తి మహిళల బ్యాంకు రుణాలు తీర్చేందుకు ఆసరా పథకాన్ని తీసుకువచ్చామని, విద్యార్ధులకు ఫీజుల తిరిగి చెల్లింపు, అమ్మ ఒడి పథకాల ద్వారా ఆదుకుంటున్నామని, సాగునీటి సదుపాయం లేని వ్యవసాయ భూములక సాగునీటిని అందించేందుకు జలకళ పథకం తీసుకువచ్చామని, సాగునీటి సౌకర్యంలేని పొలాలకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి, మోటార్లు బిగించి ఉచితంగా కరెంటు ఇస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రజలు ప్రతిఏటా రూ.60 వేల కోట్లు పన్నులు రూపంలో చెల్లిస్తుంటే అంతే మొత్తాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఎందరో యువతీ యువకులు ఉత్సాహంగా సచివాలయాల్లో ఉద్యోగులుగా, వలంటీర్లుగా చేరి తమ ప్రాంతానికి, ప్రజలకు సేవలందిస్తూ సంతృప్తి పొందుతున్నారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాలకులంతా ఈ వ్యవస్థ వైపు చూస్తున్నారని చెప్పారు. అవినీతి, లంచగొండితనానికి తావులేకుండా ప్రభుత్వ సేవలన్నీగ్రామస్థాయిలోనే అందించే లక్ష్యంతో ఈ వ్యవస్థకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో నిలుస్తోందన్నారు.
శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ మంచి పాలన అందించే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రైతులు గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు పొందడంతోపాటు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా గ్రామంలోనే విక్రయించుకొనే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదేనని చెప్పారు. గత ఏడాది మొక్కజొన్న ధర మార్కెట్‌లో పడిపోయినపుడు రూ.1700 చెల్లించి రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు.
ఈ సందర్భంగా పలువురు వికలాంగ బాలలకు మూడు చక్రాల సైకిళ్లను మంత్రి బొత్స సత్యనారాయణ పంపిణీ చేశారు. అంతకుముందు మరుపల్లి గ్రామస్థులు మంత్రి బొత్సకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకటరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, డ్వామా పి.డి. నాగేశ్వరరావు, సిపిఓ విజయలక్ష్మి, సాంఘికసంక్షేమశాఖ డి.డి. సునీల్ రాజ్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి మహరాజన్ తదితరులు పాల్గొన్నారు.