తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ కలిసి ఆవిష్కరించారు.
తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుండి అక్టోబరు 8వరకు శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.
తిరుమలలో సంవత్సరం పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవని చెప్పారు. ఈ నెల 21న విజయవాడకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబరు 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.