శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుత కారు డ్రైవర్ రాయుడు హత్య కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని శ్రీకాళహస్తి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. డ్రైవర్ హత్య కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలైన నిందితురాలు వినుత కోట ఒక వీడియోను విడుదల చేసిన తరుణంలో బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.
'డ్రైవర్ రాయుడు వీడియోను నేను నిన్ననే చూశా. మా కుటుంబం 45 యేళ్లుగా శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తోంది. 2019 ఎన్నికల్లో నాకు 71 వేల ఓట్లు వచ్చాయి. వైకాపా హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోయాను. 2024లో కూటమి ప్రభుత్వం తరపున నాకు టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ల ఆశీస్సుల వల్ల మంచి మెజార్టీతో గెలిచా. కోట వినుత దంపతులు డ్రైవర్ రాయుడును హత్య చేశారు. ఈ ఘటన గురించి సీసీ ఫుటేజీల వచ్చాయి. చెన్నై నగర పోలీస్ కమిషనర్ కూడా వివరించారు' అని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.