Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ప్రభుత్వ పథకాలపై నిఘా కన్ను...

ఒకప్పుడు పొదుపు సంఘాలుగా అందరికి తెలిసిన మహిళా స్వయంసహాయ సంఘాలు, రాష్ట్రంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పధకాల అమలుపై సమాంతర నిఘా వ్యవస్థగా మారుతున్నాయి. వీటికి రాష్ట్రస్థాయి నుంచి గ్రామ పంచాయితి స్థాయివరకు పటిష్టమైన ‘నెట్ వర్క్’ వుండడంతో, ప్రభుత

Advertiesment
Society for Elimination of Rural Poverty
, సోమవారం, 10 జులై 2017 (20:37 IST)
ఒకప్పుడు పొదుపు సంఘాలుగా అందరికి తెలిసిన మహిళా స్వయంసహాయ సంఘాలు, రాష్ట్రంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పధకాల అమలుపై సమాంతర నిఘా వ్యవస్థగా మారుతున్నాయి. వీటికి రాష్ట్రస్థాయి నుంచి గ్రామ పంచాయితి స్థాయివరకు పటిష్టమైన ‘నెట్ వర్క్’ వుండడంతో, ప్రభుత్వ దృష్టి వీటిపై పడింది. వీటిని ఉపయోగించుకుని క్షేత్రస్థాయి వాస్తవాల్ని తెలుసుకోవచ్చనే నిర్ణయానికి అది వచ్చింది. దాంతో మొదటి నుంచి ఈ గ్రూపుల ఆర్ధిక పరిపుష్టికి బ్యాంకు లింకేజిలను సమన్వయపరిచిన- ‘సెర్ప్’  సంస్థ రంగంలోకి దిగింది. 
 
ఫలితంగా గత ఏడాదిగా ఎటువంటి ప్రచారం లేకుండా, చాపకింద నీరులా- 18-35 ఏళ్ల మహిళా బృందాల క్రియాశీల భాగస్వామ్యంతో ఎంపిక చేసిన పధకాల అమలు వాస్తవ స్థితిగతులను ప్రభుత్వం ప్రతిరోజూ సేకరిస్తున్నది. ఇలా వీటి అమలు తీరుతెన్నుల మీద డేగ కన్ను వేయటమే కాకుండా, పధకాల అమలులో ఆయాప్రాంతాల్లో ఎదురవుతున్న అవాంతరాలను  తెలుసుకుని సకాలంలో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నది.
  
వివరాల్లోకి... వెళితే 2002 జూన్ లో 'సెర్ప్' నేతృత్వంలో 'వెలుగు పధకం మొదలైన తర్వాత గ్రామాల్లో మహిళల గ్రూపులను ఏర్పాటుచేయడం, అవి నిలదొక్కుకోవడానికి చేయూత ఇవ్వడం, సభ్యుల పాటవ నిర్మాణానికి సహకరించడం, గ్రూపులకు నిర్వాహణ మెళకువలు నేర్పడం, ఆర్ధిక పరమైన అవసరాలకు బ్యాంక్ లింకేజీలను ఏర్పాటు చేయడం, అందుకున్న సహాయం ద్వారా ఆర్ధిక స్థిరత్వం పొందడం జరిగేది. అప్పట్లో ఈ గ్రూప్‌లు- విస్తళ్ళు, అప్పడాలు, పచ్చళ్ళు వంటి గృహవస్తు ఉత్పత్తుల తయారీ వంటివాటికే పరిమితమై వుండేది. తదనంతర కాలంలో గ్రూపుల విస్తరణ క్రమంలో టెంత్, ఇంటర్మీడియట్ చదివిన యువతులు కూడా గ్రూపుల్లో సభ్యులు కావడంతో వీరి పరిజ్ఞానాన్ని విస్తరించే విధంగా ‘సెర్ప్’ పధకాలు రూపొందించింది. 
 
బుక్ కీపింగ్, స్వయం సహాయ బృందాల ట్రెయినర్స్, బీమా మిత్ర, పశుమిత్ర, బ్యాంక్ మిత్ర, వంటి కొత్తకొత్త పేర్లతో వీరికి వేర్వేరు సేవలను అందించే పనులు అప్పగించేది. కాగా రాష్ట్రంలో పరిపాలన ‘ఆన్ లైన్’ అయ్యాక, అభివృద్ది-సంక్షేమ పధకాల అమలు తీరుతెన్నులు సూక్ష్మస్థాయిలోకి వెళ్లి తెలుసుకోవడానికి విస్తృత మానవనరు ప్రభుత్వానికి అవసరమయింది. ఈ క్రమంలో తెరమీదికి వచ్చినదే- ‘ఇంటర్ నెట్ సాథీ’ వ్యవస్థ. వీరినే విలేజ్ డిజిటల్ అసిస్టెంట్లుగా అధికారికంగా పిలుస్తున్నారు.
webdunia
 
తొలుత ఇటువంటి ప్రతిపాదన ప్రభుత్వం చేసినప్పుడు టాటా ట్రస్ట్, గూగుల్ ఇండియా వీరికి శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చి, బ్లూఫ్రాక్ సంస్థ ద్వారా అవసరమైన ట్రైనింగ్ ఇచ్చారు. సెర్ఫ్ వీరికి అండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు అందించింది. అప్పగించిన పనికి సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సదరు ప్రయోజనం వారికి అందినది లేనిది తెలుసుకుని, వారితో 3 ఫొటోలను తీసి, అందుకోసం రూపొందించిన యాప్ ద్వారా రోజువారి నివేదికలను వీరు పంపుతారు. 
 
తొలుత వృద్దాప్య ఫించన్లు సక్రమ పంపిణిపై వీరు దృష్టి పెట్టారు. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు అయ్యాక, నగదు రహిత లావాదేవీలు గ్రామాల్లో ప్రోత్సహించడానికి గాను వీరి సేవలు వినియోగించారు. అప్పట్లో 620 మండలాల్లో 8142 మంది ఇంటర్ నెట్ సాథీలు 6,72,602 మందికి శిక్షణ ఇచ్చారు. అలా మొదలైన వీరి సేవలు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి పధకం అమలు వేగాన్ని ప్రతిరోజు ఆయా శాఖలు, ఈ ‘సాథీ’ల ద్వారా ట్రాక్ చేస్తున్నాయి. 
 
అమలులో జాప్యం వున్నచోటు గుర్తించినప్పుడు, పరిష్కారానికి ఆయా శాఖల స్థానిక అధికారులను పంపుతున్నాయి. ప్రస్తుతం- 'దీపం' పధకం క్రింద 17,522 మంది సాథీలు 35,98,716 ఇళ్లకు వెళ్ళి వారికి గ్యాస్ పొయ్యి సౌకర్యం ఉన్నదీ లేనిది నివేదికలు పంపారు. 1,28,717 మంది ఎస్.సి, ఎస్.టి లబ్దిదారులకు 'ఉన్నతి’ పేరుతో  వ్యక్తిగత పధకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి, జులై మొదటి వారం నాటికి వీరిలో 86,951 మందిని ఈ సాథీలు వారి వారి పధకాలతో గుర్తించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా 58,526 యూనిట్లు మంజూరు కాగా వాటిలో ఇప్పటివరకు 32,079 యూనిట్లను సాథీలు గుర్తించి నివేదికలు పంపారు.  
 
పధకాలపై ఇటువంటి నిఘా నివేదికలను పంపటానికి వీరికున్న పరిజ్ఞానం గురించి అడిగినప్పుడు, ఈ నివేదికలను పంపడానికి అవసరమైన యాప్‌లను సంబంధిత శాఖలకు నేషనల్ ఇన్ఫర్‌మేటిక్స్ సెంటర్ అందిస్తున్నదని, అవసరమైన శిక్షణ తమ సంస్థ ఇస్తున్నదని సెర్ఫ్ సి.ఇ.ఓ డా. పి. కృష్ణమోహన్ చెప్పారు. వీరి సేవలను ఇలా  వినియోగించుకుంటున్నందుకు నెలకు వీరికి రూ.2,500-5000 వరకు అదనపు ప్రయోజనం కలుగుతున్నదని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కోసం సాథీలు క్రాప్ సర్వే చేస్తున్నారని, స్వచ్చభారత్ మిషన్ కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టాయ్ లెట్ల సర్వే జరుగుతున్నదని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలీ బాబా అందరూ దొంగలే.. షర్మిలకు అంత సీన్ లేదు.. జగన్ జైలుకు పోతాడనే?