గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే, ఈ హత్యకు సోషల్ మీడియా పరిచయం వికటించడమే కారణమని భావిస్తున్నారు.
రమ్యను హత్య చేసిన యువకుడు శశికృష్ణగా అనుమానిస్తున్నారు. హత్యకు ముందు 8 నిమిషాలు రమ్యతో మాట్లాడిన శశికృష్ణ, అనంతరం గుంటూరు మణిపురం బ్రిడ్జిపై ఆమెతో వాగ్వాదం జరిగి హత్య చేశాడు. శశికుమార్ తోపాటు మరో వ్యక్తి బైక్ పై పరారైనట్లు సమాచారం.
దీనిపై 13 సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమై... చివరికి హత్య చేసిన ఈ కేసుపై డీజీపీ కార్యాలయం నుంచి గౌతం సవాంగ్ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు. రమ్య హత్య అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని, ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తామని, అయితే, సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డి.జి.పి సూచించారు. యువతులు, మహిళల పై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని మనవి చేశారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలని, ఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు డి.జి.పి. అభినందనలు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.