వేగవంతంగా స్మార్ట్ విలేజ్ పనులు... యనమల రామకృష్ణుడు
అమరావతి : స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, దాతల సహకారానికి ప్రభుత్వం కూడా తనవంతు తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం స్మార్ట్ ఏపీ ఫౌండ
అమరావతి : స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, దాతల సహకారానికి ప్రభుత్వం కూడా తనవంతు తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ విలేజ్, వార్డుల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.
ఇప్పటికే స్థానికులతో పాటు ఎన్ఆర్ఐ దాతలు తమతమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మరెందరో దరఖాస్తు కూడా చేసుకున్నారన్నారు. ఏదయినా అభివృద్ధి కార్యక్రమానికి దాతలు 50 శాతం నిధులు సమకూరిస్తే, ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. గతంలో చేపట్టిన పనులకు ఇప్పటికే ప్రభుత్వం తన వాటాను అందజేసిందన్నారు. స్మార్ట్ విలేజ్ పనులకు గతంలో దాతలందించే నిధులపై పన్ను భారం ఉండేదన్నారు.
ఇకపై ఏపీ స్మార్ట్ ఫౌండేషన్ కు అందజేసే నిధులకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. విదేశీయులందజేసే విరాళాలపైనా పన్ను మినహాయింపునకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. స్మార్ట్ విలేజ్, వార్డు పనులకు రెండు మూడ్రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. 50 శాతంపైగా నిధులిచ్చే పనులకు దాతల పేర్లు పెట్టొచ్చునని అధికారులకు సూచించారు. పలు గ్రామాలు, వార్డుల్లో కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని అధికారులు...మంత్రి యనమల దృష్టికి తీసుకొచ్చారు.
సగంలో నిలిచిపోయే పనులకు, కొత్తగా చేపట్టబోయే పనులకు ఆటంకంగా లేకుండా వేగవంతంగా జరిగేలా వేర్వేరుగా త్వరలో కొత్త నిబంధనలు రూపొందిస్తామన్నారు. స్థానికులు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, తాగునీరు, రోడ్లు, స్కూల్ భవనాలు, పారిశుద్ధ్యం కల్పనలో వారి భాగస్వామ్యం పొందేలా కృషి చేయాలని మంత్రి యనమల సూచించారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు తమ లాభాల్లో 2 శాతం సామాజిక బాధ్యతగా వెచ్చించాలని, ఇది కంపెనీ చట్టాల్లో కూడా ఉందని అధికారులకు మంత్రి తెలిపారు.
ఆ నిబంధనలను అనుసరించి, పరిశ్రమల నుంచి నిధులను రాబట్టడానికి కృషి చేయాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పరిశ్రమల బ్యాలెన్స్ షీట్లు పరిశీలించి, సీఎస్ఆర్ కింద 2 శాతం నిధులను సామాజిక సేవలకు వినియోగించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా 86 ఎన్ఆర్ఐలు అందజేసిన నిధులతో చేపట్టిన 86 పనులకు సంబంధించిన వివరాలను ఎన్ఆర్టీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.