గుంటూరుజిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలోని మసీద్ లో మౌజమ్ గా పనిచేస్తున్న హనీఫ్ ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడానికి వైసీపీవారే కారణమని, ముస్లింల శ్మశానంలో మట్టి తవ్వడాన్ని హనీఫ్ అడ్డుకున్నాడని, ఎమ్మెల్యే అనుచరులైన తమనే అడ్డుకుంటావా అని సదరు వ్యక్తులు హనీఫ్ ని దుర్భాషలాడారని, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి సయ్యద్ రఫీ వెల్లడించారు.
ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్మశానంలో మట్టి తవ్వే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే తాను చూస్తూ ఊరుకోలేనంటూ హనీఫ్, మట్టితవ్వుతున్నవారిని అడ్డుకుంటే, వారు ఆయనపై అమానుషంగా దాడిచేశారన్నారు. తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మౌజమ్ హనీఫ్ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారన్నారు.
ఆ వీడియోలో ఆయన అల్లా గృహాన్ని కాపాడటం తన బాధ్యతగా భావించే మట్టితవ్వకం పనులను అడ్డుకున్నానని, దానికే కొందరు వ్యక్తులు అకారణంగా తనపై దాడిచేశారని చెప్పడం జరిగిందని రఫీ తెలిపారు. తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా హనీఫ్ ఆ వీడియోలో చెప్పడం జరిగిందన్నారు.
అధికారంలో ఉన్నాం కదా అన్నఅహంకారంతో శ్మశానాలను కూడా తవ్వుకుంటామనే విధంగా వైసీపీనేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారన్నారు. మతపెద్ద అయిన హనీఫ్ పట్ల కనీస గౌరవం కూడా చూపకుండా, అతనిపై దాడిచేయడం ఏంటని రఫీ మండిపడ్డారు. ముస్లింలకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అన్న రఫీ, తప్పులను ప్రశ్నించేవారిపై వైసీపీకార్యకర్తలు దాడిచేయడం ఏంటని నిలదీశారు.
వారికి ఆ విధంగాదాడిచేసే ధైర్యం ప్రభుత్వ చర్యల ద్వారానే వచ్చిందన్నారు. రాజమండ్రిరూరల్ పరిధిలోని బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ కుటుంబానికి అన్యాయం చేసినవారిని శిక్షించకపోవడంవల్లే, ఈనాడు లాంగ్రామంలో వైసీపీకార్యకర్తలు బరితెగించారన్నారు. ఆనాడు సత్తార్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనవారిని ప్రభుత్వం విడిచిపెట్టబట్టే, నేడు తాతిరెడ్డిపాలెంలో ముస్లిం మతపెద్దపై దాడిజరిగిందన్నారు.
నంద్యాలలో బలైన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయమని వైసీపీప్రభుత్వాన్ని కోరినా, ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. వైసీపీప్రభుత్వ దోపిడీకి కొండలు, గుట్టలతో పాటు ఆఖరికి శ్మశానాలు కూడా మాయమవుతున్నాయన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే మనుషులు అయినంతమాత్రాన, అమానుషంగా ముస్లిం మతపెద్దపై దాడిచేయడం ఏమిటో పాలకులే సమాధానం చెప్పాలన్నారు.
హనీఫ్ పై దాడిచేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కిందకేసులు నమోదుచేయాలని టీడీపీ నేత రఫీ డిమాండ్ చేశారు. తమపార్టీకి చెందిన కొందరు హనీఫ్ ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారన్నారు. జరిగిన ఘటనపై ముస్లిం సంఘాలప్రతినిధులు, ముస్లిం సమాజం స్పందించాలని రఫీ సూచించారు. గతంలో కూడా కరోనా సమయంలో సత్తైనపల్లిలో గౌస్ అనే ముస్లిం యువకుడిని పోలీసులు కొట్టిచంపారన్నారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిహాయాంలో ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు వచ్చాయికదా అని, నేడు ఆయనకొడుకు మైనారిటీలపై అకారణంగా దాడిచేస్తూ, కొట్టిచంపుతున్నాకూడా నోరు తెరవకపోతే ఎలాగని రఫీ ముస్లిం సంఘాలవారిని నిలదీశారు. రాష్ట్రంలో ముస్లింలకు ప్రాణరక్షణ లేదని అర్థమవుతోందని, అందుకు కళ్లముందు జరుగుతున్న ఘటనలే ప్రత్యక్ష నిదర్శనాలన్నారు.
అబ్దుల్ సత్తార్ తనకుటుంబంపై జరిగిన వేధింపులను తట్టుకోలేక ఎస్పీ కార్యాలయం ఎదుటే పురగులమందు తాగాడని, మైలవరంలో మరోముస్లింవ్యక్తి ఉరేసుకొని చనిపోయాడని, వాటికన్నా దారుణంగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం తమకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోద్వారా తెలియచేసి, రైలుకింద పడిఆత్మహత్య చేసుకుందని రఫీ వాపోయారు.
రాయచోటిలో మైనారిటీ వర్గానికిచెందిన అంగన్ వాడీ టీచర్ ని ఎలా వేధించారో అందరం చూశామన్నారు. అధికారం ఉందికదా అని పాలకులు ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే, చూస్తూ ఊరుకునేదిలేదని రఫీ హెచ్చరించారు. నంద్యాల ఘటనలో తనకూతురు, అల్లుడు, వారి పిల్లల చావుకు కారకులైనవారిని శిక్షించాలని అబ్దుల్ సలాం అత్త కోరుతుంటే, ముఖ్యమంత్రి పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించకుంటే, వైసీపీ కార్యకర్తలు ఇలానే హద్దులుమీరి ప్రవర్తిస్తుంటారని రఫీ స్పష్టం చేశారు.
టీడీపీ కార్యకర్తలచేస్తున్న దాడులతో పాటు, సామాన్యులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలువుతోందా అనే అనుమానం అందరికీ కలుగుతోందన్నారు. మతపెద్ద హనీఫ్ పై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రభుత్వం, ముస్లింలకు అండగా ఉంటామనే సంకేతాన్ని ఇవ్వాలని రఫీ డిమాండ్ చేశారు.