వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైకాపా క్వీన్ స్వీప్ చేసింది. మొత్తం 50 స్థానాలకు గాను 47 డివిజన్లలో వైకాపా మేయరు విజయభేరీ మోగించారు. మూడు స్థానాలను టీడీపీ సభ్యులు గెలుచుకున్నారు.
ఈ నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ మేయర్‌గా వైకాపా మహిళా నేత షేక్ నూర్జహాన్ ఎన్నికయ్యారు. ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నూర్జన్హాన్తో పాటు డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్, సుధీర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
అయితే, మేయర్‌గా నూర్జాహాన్‌ను ఎంపిక చేయడం ఇపుడు చర్చనీయాశంగా మారింది. అసలు ఎవరీ నూర్జాహాన్ అంటూ ఆరా తీస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోను ఆమె ఐదేళ్లపాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా మేయర్‌గా కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరపున 50వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె భర్త ఎస్‌ఎంఆర్ పెదబాబు మొత్తం నగర పంచాయతీ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. అనేక డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెదబాబు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి.
సీఎం జగన్ ఆశీస్సులతో నూర్జహాన్ ఎన్నికల ముందు నుంచే మేయర్ అభ్యర్థిగా ఖరారయ్యారు. చివరకు అదే ప్రక్రియ కొనసాగింది. ఈ మధ్యలో కొన్ని కొన్ని అపోహలు పెద్ద ఎత్తున ప్రచారం సాగినా అవన్నీ వీగిపోయాయి.