Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరంపై జగన్ సర్కారుకు చుక్కెదురు...

పోలవరంపై జగన్ సర్కారుకు చుక్కెదురు...
, గురువారం, 22 ఆగస్టు 2019 (15:17 IST)
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. 
 
'ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసింది. కేవలం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుంది. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, మేము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తాం' అని నవయుగ సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి కుదిరిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నవయుగ సంస్థ హైకోర్టులో సవాల్‌ చేసింది. ‘మా మాట వినండి! పోలవరం టెండర్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం... పైగా, ఈ సూచన చేసిన 24 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. 
 
ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రీటెండర్‌ నోటిఫికేషన్‌తో సహా తమకు అందజేయాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్‌ను కోరిన విషయం విదితమే. పోలవరం ‘రివర్స్‌ టెండర్‌’ ప్రతిపాదనలపై ఆగస్టు 13న పీపీఏ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది.
 
పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసేందుకు, తిరిగి టెండర్లు పిలిచేందుకు ఎటువంటి కారణాలు లేవని... ‘రివర్స్‌’ వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని తేల్చింది. దీనివల్ల సామాజిక-ఆర్థిక పర్యవసానాలు కూడా ఉంటాయని కూడా తెలిపింది. ఇవే విషయాలను వివరిస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆర్కే జైన్‌ లేఖ రాశారు.

రివర్స్‌ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని, కనీసం కేంద్రం నుంచి సూచనలు వచ్చేదాకా ఆగాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌పై ముందుకెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా, హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కానీ వీరి విడుదల కోసం ప్రజలు ఆందోళన చేస్తున్నారు...