ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారని గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. బెజవాడలో రాజ్‌భవన్‌గా ఖరారు చేసిన ఇరిగేషన్ భవనాన్ని జిఎడి ముఖ్య కార్యదర్శి సిసోడియాతో కలిసి పరిశీలించిన గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.
24వ తేదీ ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారని, 23వ తేదీన భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తొలుత తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం విజయవాడ వస్తారని మీనా తెలిపారు.
ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటారని వివరించారు. విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉన్న నీటి పారుదల శాఖ భవనాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని, ఆంధ్రప్రదేశ్ తొలి పౌరునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారని, గడువు లోపు ప్రస్తుత భవనాన్ని రాజ్ భవన్ స్థాయిలో తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు.
భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని మీనా వివరించారు. ఒక దర్బార్ హాల్, ఒక మీటింగ్ హాల్, ఏడు ఆఫీస్ రూమ్స్ అందుబాటులో ఉండనుండగా, భద్రతపరంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, పోలీస్ ఆడిట్ ను అనుసరించి చర్యలు తీసుకుంటామని గవర్నర్ కార్యదర్శి తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి మండలి, శాసన సభ్యులతో గ్రూప్ ఫోటో వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
కొత్త గవర్నర్ కొత్త రాజ్ భవన్ లో నివాసం ఉండనుండగా, ఈ నెల 21 నాటికి అన్ని ఏర్పాట్లను చేసి గవర్నర్ కోసం భవనాన్ని ముస్తాబు చేయనున్నారు. సివిల్ పనులను సిఆర్‌డిఎ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఇతర ఏర్పాట్లను జిఎడి అధికారులు చేస్తున్నారని మీనా తెలిపారు. ప్రమాణ స్వీకారం నేపధ్యంలో నిబంధనల మేరకు సిఎంతో పాటు అమాత్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఆహ్వానం పలుకుతామని ముఖేష్ వివరించారు.
గవర్నర్ కార్యాలయ సిబ్బందికి సంబంధించి తెలంగాణ నుండి కొందరు ఉద్యోగులు, అధికారులు వస్తారని, మిగిలిన వారిని ఇక్కడి విభాగాల నుండి తీసుకుని గవర్నర్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నర్స్ సెక్రటేరియట్‌కు రూపకల్పన చేస్తామని, యుద్ద ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.