గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైకాపా నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు, వైకాపా నేతలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్లకు నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పట్టాభిపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టించి జైలుకు పంపించారు.
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోర్టు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే, రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలని షరతులు ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది అలాగే, పట్టాభితో పాటు ఈ కేసులో అరెస్టు అయిన వారిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.