మద్యం విక్రయాల్లో శశికళ కుటుంబం రికార్డు.. 14 ఏళ్లలో రూ.20 వేల కోట్లకు విక్రయాలు
తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కుటుంబ ఓ రికార్డును నెలకొల్పింది. గత 14 యేళ్లలో ఏకంగా 20 వేల కోట్ల రూపాయల మేరకు మద్యాన్ని విక్రయించి రికార్డు సృష్టించింది.
తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కుటుంబ ఓ రికార్డును నెలకొల్పింది. గత 14 యేళ్లలో ఏకంగా 20 వేల కోట్ల రూపాయల మేరకు మద్యాన్ని విక్రయించి రికార్డు సృష్టించింది.
శశికళ కుటుంబం ‘మిడాస్’ అనే మద్యం విక్రయాల సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 14 ఏళ్లలో రూ.20 వేల కోట్ల మద్యపానీయాలను విక్రయించి రికార్డు సృష్టించినట్టు తాజాగా వెలుగుచూసింది. 2001 నుంచి 2006 వరకు కొనసాగిన అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2003లో ప్రభుత్వం అధికారపూర్వకంగా ఈ నిర్ణయాన్ని తీసుకొనే కొన్ని నెలల ముందు 2002 అక్టోబర్ 28న ‘మిడాస్ గోల్డన్ డిస్ట్రిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే పేరుతో మద్యపానీయాల ఉత్పత్తిని ప్రారంభించింది.
ముగ్గురు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో స్థాపించిన ఈ సంస్థలో 2004లో శశికళ బంధువులైన రావణన్, శివకుమార్, కార్తీకేయన్, కలియ పెరుమాళ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. అనంతరం టాస్మాక్ సంస్థ ఆధీనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం చిల్లర దుకాణాలకు అవసరమైన మద్య పానీయాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసే స్థాయికి మిడాస్ సంస్థ ఎదిగింది. డీఎంకే అధికారంలో ఉన్న 2007 నుంచి 2011 కాలంలో మిడాస్ సంస్థ నుంచి రూ.2,773 కోట్లకు మద్యపానీయాలను కొనుగోలు చేసింది.
కానీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే మిడాస్ సంస్థ వ్యాపారాలు ఊపందుకున్నాయి. కొత్త బ్రాండ్లతో మద్యపానీయాలను పరిచయం చేసిన కారణంగా 2011-12లో రూ.1,404 కోట్లు, 2012-13లో రూ.1,729 కోట్లు, 2013-14లో రూ.2,280 కోట్లు, 2014-15లో రూ.2,736 కోట్లు, 2015-16లో 3,283 కోట్లని ఐదేళ్లలో రూ.11,432 కోట్ల స్థాయికి ప్రభుత్వానికి మిడాస్ సంస్థ మద్యపానీయాలను విక్రయించి లబ్ధిపొందింది.
ఇదిలా ఉండగా, గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని అన్నాడీఎంకే చేజిక్కించుకోవడంతో మిడాస్ సంస్థ ఆదాయం రెట్టింపు అయింది. ఫలితంగా గత 14 యేళ్లలో ఈ సంస్థ ఏకంగా రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించింది.