మాదకద్రవ్యాల రవాణాపై ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...?!
గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ప్రచార బాకాలు అయిన ఓ వర్గం మీడియా, వాటన్నింటిలో అబద్ధాలు వండి వార్చుతూ పోతున్నారు. వాటిలో కూడా పైత్యం పరాకాష్టకు చేరితే, సంధి ప్రేలాపనల దశ దాటిపోతే, మానసిక పరిస్థితి దారుణంగా ఉంటే, ఎలాంటి కథలను అయినా, వాళ్లు సృష్టించుకున్న ఊహా లోకంలో విహరిస్తూ.. వైల్డెస్ట్ స్టోరీలు ప్లాన్ చేస్తూ... రాస్తున్న కథలు, విష ప్రచారాలను చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోతున్నాం.
- అధికార పక్షం చేసే పనులను ప్రతిపక్షం ఆమోదించలేదు కాబట్టి, కచ్చితంగా వాటిలో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయాలు సూచించండానికి ప్రయత్నిస్తుంది. ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చూస్తూనే ఉంటాం. దానికి ఎక్కడో ఒకచోట పొగ లాంటిది అన్నా ఉండాలి. అయితే తోక కనపడకుండా తోక మీద వెంట్రుక కనిపించినా పులి అని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగారికి, మా పార్టీ నాయకులకు ముడిపెడుతూ దుష్ప్రచారం చేయడం మరీ అన్యాయమైన స్థాయికి దిగజారిపోయింది.
2- హెరాయిన్‌కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ విమర్శలు చేస్తోంది. వీటిపైనే రోజూ ఉదయం, సాయంత్రం చర్చలు పెట్టి దానిమీద స్టోరీలు రాసి, ఆఖరుకు సినిమా చూసిన తర్వాత పాత్రలు ఎలా ఉంటాయో.. అలానే అవే తెలిసిన పాత్రలు, విషయం ఒకటే. ఎటు నుంచి ఎటు వచ్చినా.. దాన్ని ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యమంత్రిగారికి ముడి పెట్టడమే వీళ్ళ ఎజెండా. ముంద్రా పోర్టులో దొరికిన మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసును కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
- ఒకవేళ సుధాకర్ అనే వ్యక్తి లేకపోయినా, ఏదోరకంగా ఏపీకి లింక్ కలిపేవారేమో. అదానీ అంటే రాక్షసుడు అన్నట్లు క్రియోట్ చేశారు. ఏదో ఒకదాన్ని పట్టుకుని గురి పెట్టి కొడుతూ ఉంటారు. దాన్ని కృష్ణపట్నం పోర్టు తీసుకున్న అదానీకి కలిపి ఉండేవారు. వీరికి నంజుకోవడానికి బేస్‌లాగా గంజాయి అంశం మరొకటి దొరికింది. గంజాయి టూ హెరాయిన్, హెరాయిన్ టూ గంజాయి అంటూ వంశవృక్షం పెట్టి మరీ టీడీపీ ఈ- పేపర్ లో రాసుకు వస్తున్నారు.
- చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ హైదరాబాద్‌లో కూర్చుని స్కెచ్ వేసుకుంటూ.. విజయసాయి రెడ్డి, వైఎస్ అనీల్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. వీరిని ఎవరూ అడిగే వాళ్లు లేరా? అని డౌట్ వస్తోంది.
3- నారా లోకేష్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారట. ఇన్నివేల కోట్ల విలువైన హెరాయిన్ కేసు బయటపడినప్పుడు.. మరి లోకేష్ అక్కడ ఏం చేస్తున్నట్లు.. చంద్రబాబు నాయుడు తాను సంపాదించింది డ్రగ్స్ బిజినెస్‌లోకి మళ్లించినందువల్ల, రాజకీయంగా ఎలాంటి మనుగడ లేకపోవడంతో ఆయన, ఆయన కుమారుడు, కుటుంబం అందరూ డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగారామో అనే అనుమానం కలుగుతుంది. అందుకే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు తాను, తన బాకాలు ఆరోపణలు చేస్తున్నాయో అని గట్టిగా అనుకోవాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టుగానే వారి కదలికలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై కచ్చితంగా సీబీఐ లేదా డీఆర్‌ఐ విచారణలో అసలు విషయం బయటకు రాబట్టాలనేది మా ఆకాంక్ష.
4- రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి. 1. హెరాయిన్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపి వాస్తవాలు బయటకు తీసుకురావాలి. అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం, వాటి వాడకం వల్ల జరిగే నష్టాలను తలచుకుంటే భయం వేస్తోందని... మాదక ద్రవ్యాలు సరఫరాలో వేలకోట్లు అవలీలగా లావాదేవీలు జరగడం చూస్తే మామూలు విషయం కాదని, వాళ్లు ఎలాంటివాళ్లు అయినా బయటకు రావాలని.. ఇందుకు బాధ్యులైనవారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారితో పాటు మా పార్టీ డిమాండ్ చేస్తోంది.
5- ఈ నేపథ్యంలో గంజాయికి సంబంధించినంత వరకూ.. ఏపీ అడ్డాగా మారిందని టీడీపీ విమర్శలు చేయడం చూస్తే.. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. గంజాయి రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో చాలా ఫోకస్‌గా పని చేస్తోంది. మావోయిస్టుల ప్రాభవం ఉన్న ప్రాంతాలైన ఏవోబీలో గంజాయి పట్టుబడినట్లు వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
గంజాయి రవాణాకు కళ్లెం వేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టి అందుకోసం స్పెషల్ టీమ్‌ను(సెబ్) ఏర్పాటు చేసి గంజాయి దందాను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి దందా ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సాగును అరికట్టి, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆదేశాలు ఇవ్వబట్టే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
6- ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు దాడులు చేసి పట్టుకుంటే అది కూడా తప్పేనా? వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఈబీను ప్రారంభించి, ప్రత్యేకంగా దాడులు జరిపి, ఇప్పటివరకు 2లక్షల 50వేల కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇంత మొత్తంలో గంజాయి సాగుతో పాటు అక్రమ రవాణా అనేది ఇప్పటికిప్పుడు జరుగుతున్నది కాదు. ఇది ఎన్నో దశాబ్ధాలుగా జరుగుతూ వస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మరి నిద్రపోయారా? లేక గంజాయి దందాలో వాటాలు తీసుకున్నారా?
7- అనైతిక చర్యలు, అవినీతితో కూడిన అక్రమమైన దారిలో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆలోచనలు, వ్యవహార శైలికానీ, ఆయన చుట్టూ ఉన్న మందకానీ ఎలాంటి వాళ్లు ఉంటారో ఊహించుకోవచ్చు. టీడీపీ హయాంలో గంజాయి దందా బయటకు రాలేదంటే దాన్ని చూస్తూ వదిలివేయడం వల్లే కదా? జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో గంజాయి గురించి వార్తలు వస్తున్నాయంటే ... గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం వల్లే.
- హెరాయిన్, గంజాయి అని వార్తలను కలిపికొట్టి, ఆఫ్ఘనిస్తాన్‌కు వరకూ లింకులు కలిపి ఎల్లో మీడియా వార్తలు రాస్తే దాన్ని చూసినవారు.. హెరాయిన్-గంజాయి ఒకటే అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతగా కన్ఫ్యూజ్ చేసి, కథలు అల్లి మా మీదకు తోస్తున్నారు. సమాజాన్ని నాశనం చేసే వ్యాపారమైన గంజాయిని మూలమట్టాలకు తొక్కేయాలని ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో చేస్తున్న చర్యల విషయంలో మా ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి. అయితే అదెలాగు మీకు చేతకాదు.
ఈనాడును న్యూస్ పేపర్ అనాలా?
8- ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పాండోరా పత్రాల్లో జగన్ పేరు ఉండే ఉంటుంది అంటూ కథనం ప్రచురించారు. ఎవడైనా మనిషి అనేవాడు ఇలాంటి హెడ్డింగ్ పెడతాడా? పాండోరాలో రామోజీరావు ఉండే ఉండవచ్చు అంటే ఆయనకు మండదా. చంద్రబాబుకు ఎలాగూ సిగ్గులేదు. ఎవడో ఏ కూత కూస్తే దాన్ని తీసుకువచ్చి అచ్చు వేస్తారా? తాటికాయ అక్షరాలతో ప్రచురిస్తారా? మేము ఏమైనా వెట్టికి వచ్చామా? ఏమీ చేసినా చెల్లుతుంది అనుకోవడానికి?
- లేక జగన్ మోహన్ రెడ్డిగారిని ఏమన్నా ఏమనుకోరు అనా? ఇది చాలా తప్పు. మీరు పత్రికలో ప్రచురిస్తున్నారు కాబట్టే చంద్రబాబు అంటున్నారు. ఒకవేళ ఆయన అనకపోయినా చంద్రబాబు భావిస్తున్నారంటూ మీరు హెడ్డింగ్ లు పెట్టగలరు. కనీసం చిన్నపాటి ప్రాతిపదికతో అయినా వార్త రాస్తారా అంటే అదీ లేదు? వీటిని చదివి ప్రజలు ఏమనుకుంటారు? ఈనాడును న్యూస్ పేపర్ అనాలా? మొత్తం బట్టలు అన్ని వదిలేసి రెండు పత్రికలు, రెండు టీవీ చానల్స్ చేస్తున్న దుష్ప్రచారాలు చూస్తుంటే ఏమని సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు.
9- చిన్న ఆధారం ఉన్నా దాన్ని పెద్ద కథ అల్లితే దాన్ని డిఫైన్ చేయడానికి మేము ప్రయత్నించవచ్చు. అలాంటిది ఏమీ లేని దాని గురించి ఏం మాట్లాడతాం. ఇక తెలుగుదేశం ఈ పేపర్ లో.. చక్రం గీసి.. వంశవృక్షంలా రాసుకువచ్చారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవం కాదు.
వీటిని ఎవరైనా చూస్తే స్మగ్లర్లంతా ఇక్కడే ఉన్నారేమో దోచుకునేందుకు అనేలా వాళ్ల రాతలు ఉన్నాయి. సంబంధం లేనివారి పేర్లు రాసి ఇంత అడ్డగోలుగా రాయడానికి మీకుఏం హక్కు, అధికారం ఉందని ప్రశ్నిస్తున్నాం? పేపర్ చేతిలో ఉంది కదా అని మట్టి, మశానం వేయడానికి టీడీపీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. మేము కూడా ఇటునుంచి వేయవచ్చు. మీరు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలుసు.
10- గతంలో కాంగ్రెస్ పార్టీ- టీడీపీ కలిసి జగన్ మోహన్ రెడ్డిగారిపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పోయి ఏమేమీ చేశారో అందరికి తెలుసు. కశ్మీర్‌లో హ్యూమన్ రైట్స్ కమిషనర్‌గా ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను చేయడం, ఆయన వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చి సీబీఐ విచారణకు ఆదేశించినప్పుడే తెలిసింది. ఏ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో, మీకు వాటిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఏమాత్రం ఉందనేది అందరికీ తెలుసు. మీరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఎప్పటికప్పుడు ప్రజలు నిరూపిస్తూనే ఉన్నారు. అయినా మీకు సిగ్గులేదు. మాకు తెలిసిన విద్య ఇదే అనుకుంటూ వెళుతున్నారు.
అలీషాతో బాబుకే సంబంధాలు.. ఇదిగో ఫోటో సాక్ష్యం
11- అలీషా ఎక్స్‌పోర్టుకు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి హెరాయిన్ కేసులో సంబంధం ఉందంటూ పచ్చ పత్రికల్లో, వారి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఆరా తీస్తే.. తీరా ఆలీషా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గంటా శ్రీనివాస్‌రావుతో కలిసి ఫోటోలు దిగారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. వెతికితే ఇలాంటివి చాలా దొరుకుతాయి. అంతకు ముందు మేమేమీ అనలేదే? అయితే మీరు మాపై ఆరోపణలు చేశాకే వెతికితే ఈ ఫోటో దొరికింది. అనడం ఎందుకు? మాతో తన్నించుకోవడం ఎందుకు?
12- జగన్ పాదయాత్ర ప్రారంభిస్తుంటే.. ప్యారడైజ్ లీక్స్ అని దుష్ప్రచారం చేశారు.. వాటిపై జగన్ గారు సవాల్ విసిరితే బాబు పారిపోయాడు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి రైస్ ఎక్స్‌పోర్టు బిజినెస్ ఉంది. దాన్ని పట్టుకుని ఆలీషా, సుధాకర్ అంటూ ఎక్కడెక్కడో పేర్లు తీసుకు వచ్చి హెరాయిన్‌తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
గతంలోనూ వికీలీక్స్, ప్యారడైజ్, పనామా పేపర్లతో సంబంధాలు ఉన్నాయంటూ మీ పచ్చ పేపర్లు, టీవీ చానల్స్‌లోనూ ఊదరగొట్టారు. పనామా పేపర్ల కేసులో చివరికి దొరికిందేమో హెరిటేజ్ ఇండిపెండెంట్ డైరెక్టరే. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పడు. చంద్రబాబు ఎంత వితండవాది అంటే ఆరోపణ చేయడం, దాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేయడం సిగ్గుచేటు. ఇందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా అంటే అదీలేదు.
బాబు హయాంలో అన్నీ స్కాములే..
13- రాష్ట్రానికి 14ఏళ్లు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హయాంలో తెల్గీ స్టాంప్‌ల కుంభకోణంలో చంద్రబాబు శిష్యులు ఉన్నారు. హసన్ అలీ గుర్రాల వ్యాపారి కేసు, దొంగనోట్ల కేసు, యూరో లాటరీ కేసు... ఇవన్నీ మీ హయాంలో జరిగినవి కావా? చంద్రబాబు స్వభావమే బూటకం. చేసేవి తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, అడ్డదారిలో చేసినవ్నీ మీ హయాంలోనే.
- మావైపు నుంచి చూస్తే 11ఏళ్లు సఫరింగ్, స్ట్రగుల్ ఫేస్ చేయడం తప్ప మరొకటి లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసుల్లోనూ ఏమీ లేదని మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు సచివాలయానికి కూడా రాలేదు. రూలింగ్‌లోనూ లేరు. ఏరకంగా చూసినా అధికారంలో ఉంది మీరు. అవకాశం మీకు మాత్రమే ఉంది. అన్నిరకాల మీ మోసపూరితమైన మాటలు, మీ జీవితం మొత్తం అబద్ధం అని మీ కుటుంబసభ్యులు, బంధువులకు తెలుసు. ఇంత తెలిసినా ఇంకా అబద్దపు ఆరోపణలు చేస్తున్నారంటే ఏమనాలి.
14- రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని విషతుల్యం చేయాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై చట్టపరంగా ప్రొసీడ్ అవడానికి సిద్ధం అవుతున్నాం. మీరు చెబుతున్న మాటల్లో నిజాయితీ లేదు, వాస్తవం ఏమాత్రం లేదనేది మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యవహారాల మీద ప్రజలను మిస్‌లీడ్ చేయడానికి ఆరోపణలు చేస్తున్నారు. గంజాయి సాగును నేలమట్టం చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించాల్సింది పోయి.. హెరాయిన్‌కు గంజాయికి లింక్‌పెట్టి అల్లుతున్న కథను సినిమా కథకు ఏమైనా రాంగోపాల్ వర‍్మకు ఇస్తే పనికివస్తుంది.
15- దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఉన్న అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలు షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. వీటిపై మేము ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ప్రజల డబ్బులతో రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయనకు తెలుసు కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేయగలుగుతున్నాడు. జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం.