Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్కో సెలబ్రేషన్స్‌లో సమ్మర్ శారీ మేళా ప్రారంభించిన ఆర్కె రోజా

roja
, గురువారం, 12 మే 2022 (19:09 IST)
ఆధునిక డిజైన్లు, అందుబాటు ధరలలో లభిస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించాలని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా యువజనాభ్యుదయ శాఖ మంత్రి ఆర్కె రోజా అన్నారు. విజయవాడ పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన ఆప్కో సెలబ్రేషన్స్‌లో చేనేత సమ్మర్ శారీ మేళాను గురువారం మంత్రి రోజా ప్రారంభించారు.

 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఈ శారి మేళాలో రాష్ట్రంలో పేరొందిన బండారులంక, అంగర, పోలవరం చీరలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ జరీ చీరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు పది రోజుల పాటు జరుగనున్న శారీ మేళాలో ప్రత్యేకంగా ముఫైశాతం రాయితీని సైతం అందించటం ముదావహమన్నారు. ఆకర్షణీయమైన రంగులలో మరెక్కడా లేనటువంటి చీరల శ్రేణి ఇక్కడ అందుబాటులో ఉందని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.  

 
చేనేత కార్మికులకు నిరంతరంగా పని కల్పించాలన్న ధ్యేయం మేరకు సొంత మగ్గం ఉన్న ప్రతి కార్మికునికి నేతన్న నేస్తం పథకం ద్వారా ముఖ్యమంత్రి సంవత్సరానికి 24 వేల రూపాయలు అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ తోడ్పాటుకు అదనంగా రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలను ఆదరించటం ద్వారా వారి ఉన్నతికి సహకరించాలన్నారు. 

 
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు మాట్లాడుతూ, చేనేత కార్మికులకు కావలసిన ఆధునిక పనిముట్లు అందించి, కొత్త డిజైన్లు తయారు చేయించి, తగిన మార్కెటింగ్ ద్వారా వారికి ఆర్ధిక పరిపుష్టి సాధింపచేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. రానున్న రోజుల్లో అన్ని ముఖ్య నగరాలలో ఆప్కో మెగా షోరూంలు ఏర్పాటు చేసి, చేనేత వస్త్రాలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

 
చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, సమ్మర్ శారీ మేళాలో అతి సన్నని నూలు దారాల నేతతో, ఆకర్షణీయమైన  ప్రింటింగ్ చేయించిన చీరలు అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. యువత సైతం చేనేత వస్త్రాలు ధరించే విధంగా వారికి కావలసిన రెడీమేడ్ గార్మెంట్స్, టాప్స్, పంజాబి డ్రస్ మెటీరియలుతో పాటు ఎంబ్రాయిడరి బ్లౌజెస్ కూడా ఆప్కోలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆప్కో వ్యాపార అభివృద్ది ప్రణాళికలలో భాగంగా క్రొత్త షోరూంలను ఏర్పాటు చేయటంతో పాటు, ప్రస్తుతం ఉన్న షోరూంలను ఆధునీకరించనున్నామన్నారు.

 
చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేయటమే కాక, చేనేత వస్త్రధారణ ఎంతో హుందాతనాన్ని ఇస్తుందని నాగరాణి పేర్కొన్నారు. చేనేత అనేది ఒక సాంప్రదాయ కళ కాగా, ఈ కళను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంచాలకులు నాగేశ్వరరావు, కన్నబాబు, కేంద్ర కార్యాలయ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, డివిజినల్ మార్కెటింగ్ అధికారి ఎస్‌వివి ప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పాన్-ఆధార్ తప్పనిసరి