ఒకేరోజు 55 కరోనా కేసులు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. అది కూడా సరిగ్గా మూడురోజుల క్రితమే. కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినా సరే మార్పు అనేది మాత్రం ప్రజల్లో కనిపించడం లేదు. మాస్కులు లేవు, సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో టిటిడి కౌంటర్ల ద్వారా టోకెన్లను అందిస్తోంది. ఆ టోకెన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు. రోజుకు 5 వేల టోకెన్లను అందించనుంది. ఇప్పటికే నగరంలోని 5 ప్రాంతాల్లో కౌంటర్లను కూడా సిద్థం చేశారు.
వైకుంఠ ఏకాదశి సంధర్భంగా పదిరోజుల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు కాబట్టి ఆ పదిరోజుల్లో స్థానికులు స్వామివారిని దర్సించుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. అందుకే స్థానికులకు 5 వేల చొప్పున 50 వేల టోకెన్లను మంజూరు చేస్తోంది.
ఇది బాగానే ఉంది. కానీ టోకెన్ల మంజూరు సమయంలో ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించే విధంగా మాస్కులను ధరించే విధంగా టిటిడి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కౌంటర్లలోకి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులతో రావాలని.. అలాగే దూరం దూరంగా ఉండాలని టిటిడి సెక్యూరిటీ అధికారులు ముందుగానే సూచించాలి.
ఏ ఒక్కరు నిబంధనలను పాటించకపోయినా వారిని బయటకు పంపిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణ కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్న దృష్ట్యా టిటిడి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరికి పాజిటివ్ ఉన్నా వారి ద్వారా చాలామందికి కరోనా సోకే అవకాశం ఉంది. మరి టిటిడి జాగ్రత్త వహిస్తుందో లేకుంటే అలాగే ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి.