స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్, చైల్డ్ సైకాలజిస్టులు తదితర పోస్టుల ప్రక్రియ జిల్లా స్థాయి కమిటీ మెరిట్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయని ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సులు, డబ్బులతో ఉద్యోగాలు కొనుగోలు చేయడం వంటి దొడ్డిదారి పద్ధతులు ఈ నియామకాలలో ఏమాత్రం చెల్లవని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.
బుధవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఇబ్బందులను తెలుసుకొన్నారు. విజయవాడ మధురానగర్ కు చెందిన వనబోయిన రేవతి అనే యువతి మంత్రితో మాట్లాడుతూ , ఫార్మసీ లో 86 శాతం మార్కులు పొందిన తాను ఫార్మసిస్ట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్నానని దయచేసి ఆ ఉద్యోగానికి రికమెండ్ చేయాలని కోరింది.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సిబ్బంది కొరత వల్ల గత కొన్నేళ్లుగా ఆసుపత్రుల్లో వైద్యసేవలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతో కరోనా నిర్ధరణ పరీక్షలకు సమస్య తలెత్తిందన్నారు. ట్రూనాట్, వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లలో పనిచేసేందుకు వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి నియమించామని వివరించారు.
కృష్ణాజిల్లాలో నర్సింగ్, ఎల్‌టీ కోర్సులు, ఫార్మసీ కోర్స్ లు పూర్తి చేసిన వారు వేల సంఖ్యలోనే ఉన్నారని అన్ని విభాగాలకు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఇప్పుడు భర్తీ ప్రక్రియ పకడ్బందీగా మొదలుకానున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. మెరిట్‌కు 75, అనుభవానికి 15 మార్కులు ఇంటర్వ్యూలో కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయస్సు మినహాయింపు ఇచ్చారని మంత్రి తెలిపారు.
సమస్యలను చెప్పుకొన్న అర్జీదారులు
బందరు మండలం కానూరు గ్రామానికి చెందిన బలగం రవి, మంత్రిని కలిసి తన సోదరునికి గుండె సస్త్ర చికిత్స జరిగిందని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆయా మొత్తం డబ్బును మంజూరుచేయాల్సిందిగా అభ్యర్ధించారు.
మచిలీపట్నం రాజుపేటకు చెందిన వేమన శ్రీరాములు తాను నేషనల్ కళాశాల సమీపంలో డంప్ యార్డ్ సమీపంలో జీవనాధారం కోసం ఒక బడ్డీ కొట్టు ఏర్పాటుచేసుకొన్నానని రెండురోజుల క్రితం 36 వ వార్డు సచివాలయం నుంచి ముగ్గురు ఉద్యోగులు వచ్చి బడ్డీ తక్షణమే తొలగించాలని వత్తిడి తెస్తున్నట్లు తెలిపారు.