Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు శివయ్య భూముల్లో దారి.. చోద్యం చూస్తున్న అధికారులు

శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు, దాతలు విరాళంగా అందజేసిన వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నా, ప్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నా దేవస్థాన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు శివయ్య భూముల్లో దారి.. చోద్యం చూస్తున్న అధికారులు
, శనివారం, 22 అక్టోబరు 2016 (12:58 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు, దాతలు విరాళంగా అందజేసిన వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నా, ప్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నా దేవస్థాన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోనే వందల ఎకరాలు అన్యాక్రాంతమైనా పట్టించుకోని దుస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించిన భూముల్లో రోడ్డును చూపి ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంచర్‌ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
 
శ్రీకాళహస్తి మండలం చుక్కనిడిగల్లు గిరిజన కాలనీ సమీపంలో దేవస్థానానికి దాదాపు 42 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో ఆలయాధికారులు నీలగిరి తైలం చెట్లను పెంచారు. ఇటీవలే చెట్లను విక్రయించారు. చుక్కల నిడిగల్లు గిరిజన కాలనీ వాసులు స్వర్ణముఖినదిలోకి వెళ్ళాలంటే ఆలయ భూముల నుంచే వెళ్ళాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం తమ సమస్యను మంత్రి గోపాలకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన మంత్రి ఆలయ భూముల నుంచి స్వర్ణముఖి నది వరకు ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. పదేళ్లుగా ఈ మార్గం ద్వారానే నదిలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ దారి లేకుండా నదిలోకి వెళ్లాలంటే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీన్ని అందరూ హర్షిస్తున్నారు కూడా. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా జరుగుతున్న పరిణామాలపై విమర్శలు వస్తున్నాయి.
 
తిరుపతికి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చుక్కలనిడిగల్లు సమీపంలో ఉన్న ఆలయ భూములకు ఆనుకుని దాదాపు 12 ఎకరాల్లో వెంచర్‌ ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ ద్వారా లేఔట్‌ డిజైన్‌ వేయించారు. వెంచర్‌కు ఆనుకుని ముక్కంటి గోపురం, విశాలమైన రహదారి పక్కనే స్వర్ణముఖినది చూపుతూ ఆహ్లాదకరమైన వాతావరణం అంటూ అందమైన డిజైన్లతో కరపత్రాలు ముద్రించారు. వాస్తవానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చూపుతున్న వెంచర్‌కు అసలు దారే లేదు. పుల్లారెడ్డి కండ్రిగ రోడ్డు నుంచి చుక్కలనిడిగల్లు గిరిజన కాలనీ వరకు గతంలో ఉన్న మట్టిరోడ్డు స్థానంలో సదరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గ్రానేట్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆలయ భూముల హద్దు వరకు గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. 12 కరాల్లో వేసిన ప్లాట్లకు సంబంధించి ఇప్పటికే 70 శాతంకుపైగా విక్రయాలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రియల్‌ వ్యాపారితో పాటు, ప్లాట్లు కొనుగోలు చేసినా వారు సైతం ఆలయ భూముల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ దారి కోసం రియల్‌ వ్యాపారి కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యం లేదని పలువురు పేర్కొంటున్నారు. రెండు మూడేళ్ళుగా ఈ తంతు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు.
 
చుక్కలనిడిగల్లు వద్ద ఉన్న ఆలయ భూములకు సంబంధించిన దారి విషయమై అధికారులు ఇప్పటికే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆలయ భూములు ఉన్నంత వరకు ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేయాలి. దీని వల్ల రియల్‌ వ్యాపారి ఆలయ భూములనే దారిగా చూపించి వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండదు. మరి ముక్కంటి ఆలయ అధధికారులు స్పందిస్తారా.. ఎప్పటిలాగే చూసీచూడనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెవెన్‌ హిల్స్ మారథాన్‌కు తిరుపతి రెడీ... నడకపై అవగాహన కోసం...