రాజ్యాంగ పరిరక్షణకి ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్ని కులాలు బాధ్యతగా మెలగాల్సిన తరుణమని చెప్పారు. జనసేన పార్టీ అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. శనివారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి శ్రీ రావెల కిషోర్‌బాబు తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరారు. ఆయన్ని, ఆయన సతీమణి శ్రీమతి శాంతిజ్యోతిని శ్రీ పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "రాజ్యాంగబద్దంగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు వచ్చిన రావెల కిషోర్‌బాబు గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. కులాలకీ, మతాలకీ, ప్రాంతాలకీ అతీతంగా జనసేన పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుంది. రావెల కిషోర్‌బాబు గారు నాకు 2009 నుంచి పరిచయం. ఆనాటి రాజకీయ ప్రస్థానంలో ఆయన సతీమణి శాంతిజ్యోతి గారు తాడికొండ నుంచి పోటీ చేసి, 15 వేల ఓట్ల పైగా సాధించారు. 2019లో ఖచ్చితంగా కిషోర్ బాబు గారిని ఎమ్మెల్యేని చేస్తాం. బలమైన మంత్రిని చేస్తాం. ఆయన చెప్పిన విధంగా టీడీపీ మాదిరి పదవులు ఇచ్చి అధికారం మా చేతుల్లో పెట్టుకోం.
జనసేన పార్టీ పదవీ ఇస్తుంది. అధికారమూ ఇస్తుంది. 2009 తర్వాత 2014లో రెండుమూడు సందర్బాల్లో రావెల కిషోర్‌బాబు గారితో కలసి ప్రయాణించాను. ఆ రోజునే ఆయన ఆవేదన గుర్తించా. ఆయన కోరుకుంటుంది ఆత్మగౌరవం, వ్యక్తికి ఇవ్వాల్సిన గుర్తింపు. దళితుల ఆత్మగౌరవం. నేను టీడీపీకి మద్దతు ఇవ్వడానికి గల ఒక కారణం కూడా కులాల మధ్య ఐక్యత సాధిస్తుందన్న నమ్మకంతోనే.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే నలిగిపోయాం. సంపూర్ణ అవగాహన లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పైగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కాస్తయినా జ్ఞానం వచ్చి ఉంటుందని భావించా. అవకాశవాద రాజకీయాలకి దూరంగా ఉంటారనుకున్నా.
జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని మాత్రం ఏనాడు ఊహించలేదు. రాష్ట్రానికి అనుభవం ఉన్నవారు కావాలనుకున్నా, అవినీతిరహిత పాలన వస్తుందని ఆశించా. కానీ నా అంచనాలని తెలుగుదేశం పార్టీ అందుకోలేకపోయింది. ఏ మూలకి వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా వేల కోట్ల అవినీతి, శాంతిభద్రతలు కరువైన పరిస్థితులు. ముఖ్యంగా కులాల మధ్య స్పర్ధలకు రాకుండా చూడమంటే, ఘోరంగా విఫలమయ్యారు. బయటికి కులాల గురించి మాట్లాడరు, లోపల చేసేదంతా కుల రాజకీయాలే. ఆడపడుచుల మీద, అధికారుల మీద ఎమ్మెల్యేలు దాడులు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి పాలన మీద పూర్తిగా పట్టు తప్పింది.
మాట్లాడితే విజన్ 2050 అంటున్నారు. ఇప్పటికే వయసు మళ్లి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. యువత, మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారంటే, బలమైన మార్పు కోరుకుంటున్నారు. జనసేన కులాల ఐక్యత గురించి బలంగా మాట్లాడటానికి కారణం, రాష్ట్ర విభజన సమయంలో కులాలతో సంబంధం లేకుండా ఆంధ్రులందర్నీ తిట్టారు. ఇలాంటి ఉద్యమాల వల్ల దళితుల ఐక్యత, ఆభివృద్ది దెబ్బతిన్నాయి. ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యవస్థ ఎక్కడో ఒక చోట మారాలి. అవకాశవాద రాజకీయాలు, డబ్బుతో ముడిపడిన రాజకీయాలు కాకుండా ప్రజలకి ఎంతోకొంత ఉపయోగపడే రాజకీయాలు అవసరం అనిపించింది. యూపీ తరహా కుల రాజకీయాలు వస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది అన్నారు.