క్రమశిక్షణ పేరిట విద్యార్థినుల చేత గుంజీలు తీయించారు. ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుసగా మూడు రోజులు బాలికలను వంద నుంచి 200 వరకు గుంజీలు తీయించడంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లలను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా, బాలికలను చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి విద్యార్థినులతో గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట వినడం లేదని ఈ పని చేయించారు.
క్రమశిక్షణ పేరిట విద్యార్థినుల చేత గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు.