స్వపక్షంలో విపక్షంలా నిత్యం మాటల తూటాలతో మంటలు రేపుతున్న వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, మార్గాని భరత్ ల పంచాయతీ నేడు వైసీపీ అధినేత, సీఎం వై.ఎస్.జగన్ ఎదుటికి రానుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే వారు ఒకరిపై మరొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వాగ్వివాదానికి దిగడంతో అధిష్ఠానం ఈ అంశంపై దృష్టి సారించింది. ఒక వైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ అధ్యక్ష పదవుల ఎంపికపై జిల్లాల్లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, మంత్రులూ, ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా ప్రతిపక్షం కూడా చేయనంతగా ఏకంగా టెంట్లు కట్టి మరీ వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది. పైకి, పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు పదవుల కోసం ఇలాంటి ఆందోళనలు తప్పవంటూ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేలిగ్గా తీసుకున్నట్లుగా చెప్పినప్పటికీ, ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం పార్టీకి తలవంపుగా వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది.
దీనిపై వైసీపీ అధినేత, సీఎం వై.ఎస్.జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అందుకు వారిద్దరినీ వెంటనే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించినట్లు తెలుస్తోంది. సీఎం వీరిలో ఎవరికి అక్షంతలు వేస్తారనేది, ఈ సమస్యను ఎలా కొలిక్కి తెస్తారనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.