ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకు వచ్చి అక్కడ నుంచి హెలికాఫ్టరులో భీమవరం చేరుకుంటారు. అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబీకులు, సంబంధీకులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమవుతారు.
మరోవైపు, ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలోగానీ, వేదికపై ఉండేవారి జాబితాలోగానీ, హెలిపాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించేవారి జాబితాలోగానీ నరసాపురం సిట్టింగి వైకాపా రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పేరు లేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
పైగా, ఎంపీ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తమకు తెలియదని వెల్లడించారు. రఘురామ సెల్‌ఫోన్ నంబరును పోలీసుశాఖ బ్లాక్‌లిస్టులో పెట్టలేదని వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఫ్లయింగ్ జోన్‌కు సంబంధించి ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా వాయుమార్గంలో రావాలంటే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు.