Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ

జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ
, శుక్రవారం, 22 నవంబరు 2019 (18:31 IST)
జనవరి 1లోగా గ్రామ,వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం వైయస్ జగన్‌ అధికారులకు తెలిపారు. జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం వైయస్ జగన్‌ స్పష్టంచేశారు. సంతృప్తి స్థాయిలో వీటిని అమలు చేయడంపైనే ప్రభుత్వం ప్రధాన దృష్టి ఉంటుందని పునరుద్ఘాటించారు. శాఖల్లో అనవసర వ్యయాలకు కళ్లెం వేస్తూ, సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలను పెంచుకోవాలని నిర్దేశించారు.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు జిల్లాల పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను క్షేత్రస్థాయిలో తప్పకుండా అమలు చేయాలన్నారు. కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత తెచ్చుకోవడానికి గట్టిగా కృషిచేయాలని, దీనికోసం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

ఈ అంశాలను మార్గదర్శక సూత్రాలుగా తీసుకొని పరిపాలనలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు.

క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్ శుక్ర‌వారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వీటికి వస్తున్న నిధులు, అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపైన అధికారులతో క్షుణ్నంగా చర్చించారు. రానున్న కాలంలో ఎలా నడవాలన్న దానిపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనవసర వ్యయం వద్దు...:
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని, నాలుగు వేల కోట్లో, ఐదువేల కోట్లో బిల్లులు పెండింగులో పెట్టిందంటే... సరేలే అనుకునేవాళ్లమని, కాని ఏకంగా రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టారని సీఎం అధికారులతో అన్నారు.

కార్పొరేషన్ల పేర్లమీద వేలాది కోట్లు అప్పులు తెచ్చి.. పౌరసరఫరాలు వంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే ప్రశ్నార్థకం చేశారని, అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామంటూ ఆర్థిక పరిస్థితులను సీఎం అధికారులకు వివరించారు. గడచిన 6 నెలల కాలంలో ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ సమయంలో వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథాకాకూడదని ఆదేశాలు ఇచ్చారు. ప్రాధాన్యతాంశాలపై ఫోకస్‌పెట్టకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు పెంచుకునే మార్గాలపైనా ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 
 
నవరత్నాలే ప్రధమ ప్రాధాన్యత...
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యతలని సీఎం స్పష్టంచేశారు. అధికారులందరూ కూడా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని వాటిని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో మేనిఫెస్టోద్వారా చెప్పకనే చెప్పామన్నారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్రలో రాష్ట్రంలోని వివిధ వర్గాలనుంచి, ప్రజలనుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని అధ్యయనం చేసి మేనిఫెస్టోను తయారుచేశామన్నారు.

ఏసీ గదుల్లో కూర్చుని, ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారుచేయలేదని, క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితులకు, వెనకబడ్డ వర్గాల వేదనల  నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నరవత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు.

ఈ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్‌)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టంచేశారు. ప్రతి పథకానికీ సంతృప్తిస్థాయిలో అమలుచేయడమే ప్రమాణం కావాలన్నారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత, ఇక్కడ కొంత చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

చేపట్టే ప్రతి పనీ కూడా ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శకసూత్రం కావాలని ముఖ్యమంత్రి ధికారులకు నిర్దేశించారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు. 
 
జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ‘‘రచ్చబండ’’...
జనవరి 1లోగా గ్రామ,వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని సీఎం అధికారులకు తెలిపారు. జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించడంతోపాటు, ప్రజలనుంచి వచ్చే అనేక విజ్ఞప్తులకు, వినతులకు సంబంధించి హామీలు ఇవ్వాల్సి వస్తుందని, అక్కడికక్కడే చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఆదేశాలకు ఇస్తామని, దీనికోసం ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. 
 
ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇస్తే, అది ప్రభుత్వం ఇచ్చే హామీయే అవుతుందని సీఎం అన్నారు. మాట ఇస్తే కచ్చితంగా చేయాలని, ఎలాంటి తాత్సారం చేయకూడదని స్పష్టంచేశారు. ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదన్నారు. విశ్వసనీయతే తనకు బలమని, దానికి భంగం కలగకూడదన్నారు.

ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని, ఆమేరకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాల పర్యటనల సందర్భంలో సీఎంగా తానిచ్చిన హామీల అమలుపైనా సీఎం సమీక్షించారు. తర్వాత రాబోయే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు.
 
కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని నిధులు...
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వస్తున్న నిధులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ పథకాలనుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకునేలా అధికారులు అన్ని చర్యలూ తీసుకోవలన్నారు. ప్రతిశాఖకు చెందిన కార్యదర్శి లేదా విభాగాధిపతి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులతో సమన్వయంచేసుకుని ముందుకు సాగాలని సీఎం సూచించారు.

వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అధికారులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ నిధులు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ  ప్రధానకార్యదర్శి నీలం సహానీ, వివిధ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ శుక్రవారం నుంచి ఇక 'జబర్దస్త్'లో కనబడను, దాని సంగతి తర్వాత చెప్తా: నాగబాబు