Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహార ధరల సూచీ తగ్గుముఖం పట్టిందా.. మరి ఈ కూర'గాయాలు' మాటేంటి?

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఆహార ధాన్యాల ధరవరల సూచి తగ్గుముఖం పట్టిందని, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆహార ఉత్పత్తుల ధరలు కనిష్ట స్థాయికి తగ్గిపోయాయని ఊదర గొడుతోంది. కానీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయలు కూరగాయాలను కలిగిస్తున్నాయ

ఆహార ధరల సూచీ తగ్గుముఖం పట్టిందా.. మరి ఈ కూర'గాయాలు' మాటేంటి?
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (04:10 IST)
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఆహార ధాన్యాల ధరవరల సూచి తగ్గుముఖం పట్టిందని, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆహార ఉత్పత్తుల ధరలు కనిష్ట స్థాయికి తగ్గిపోయాయని ఊదర గొడుతోంది. కానీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయలు కూరగాయాలను కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు కమ్ముకుని రాష్ట్రం మొత్తం చల్లబడినప్పటికీ కూరగాయల ధరలు చుక్కలనంటేశాయి. కొన్ని కూరగాయలైతే రెండు నెలల కిందటితో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరలను చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలోని 90 శాతం మంది మహిళలు ప్రభుత్వాలను శాపనార్థాలు పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఏపీలో ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పచ్చి మిర్చి ఘాటెక్కింది. బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్‌ తదితర కాయగూరలు కందిపప్పు ధరను మించిపోయాయి.  కిలో బీన్స్‌ చిక్కుళ్లు  క్యారెట్‌..  ప్రాంతం, నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80 – 85 పలుకుతోంది. కాకర, గోరుచిక్కుడు, బీట్‌రూట్, కీరదోస, వంగ తదితర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో కంద గడ్డ రూ.70పైగా ఉంది. రైతు బజారు కాళేశ్వరరావు మార్కెట్‌లో కూడా కిలో కంద రూ.60కి పైగా అమ్మడం గమనార్హం. 
 
సాధారణ రోజుల్లో కిలో రూ.15, 20 ఉండే కీరదోస ప్రస్తుతం విజయవాడ రైతు బజారు కాళేశ్వరరావు మార్కెట్లో ఏకంగా రూ.45కి పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.12 ఉండగా విజయవాడలో రూ.20 నుంచి 22 వరకూ అమ్ముతుండటం గమనార్హం. విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో టమోటా రూ.30పైగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతితోపాటు చిన్న పట్టణాల్లో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో పొట్ల కాయను దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.20కి అమ్ముతున్నారు.  
 
కరువు వల్ల నీరు లేక కూరగాయల తోటల సాగు తగ్గడం, ఎండలకు తోటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే కూరగాయల ధరలు పెరిగాయని, మరో నెలన్నర పాటు ఈ ధరలు ఇలాగే ఉంటాయంటున్నారు. మూడు నాలుగు నెలలు కష్టపడి కూరగాయలు పండిచిన వారికి వచ్చే మొత్తం కంటే ఒకటి రెండు రోజులు మార్కెట్‌లో పెట్టి అమ్మేవారు, దళారులే ఎక్కువ డబ్బు పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. ‘మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80కి అమ్ముతున్నారు. మాకు మాత్రం రూ.40 కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంత అన్యాయం చేస్తున్నారు...’ అని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లెకు చెందిన లోకనాథం నాయుడు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
’కిలో చిక్కుడు కాయలు మావద్ద రూ.40కి తీసుకుంటున్నారు. వ్యాపారులేమో మార్కెట్‌లో రూ.75, 80 అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దుకాణం అద్దె, మనిషికి కూలీ, ఇతర ఖర్చులు అంటారు. మేం అమ్ముకోలేం కాబట్టి వారు చెప్పిన రేటుకు ఇచ్చి వెళ్లక తప్పడంలేదు’ అని వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లికి చెందిన రైతు కులశేఖర్‌ అన్నారు. ధరలు ఇలా మండిపోతుంటే ఏమి తిని బతకాలంటూ పేదలు వాపోతున్నారు. 
 
నెల రోజులుగా ఎండలే అనుకుంటే కూరగాయల ధరలూ మండిపోతున్నాయి. అర కిలో కూరగాయలతో తాళింపు చేసుకునేటోళ్లం పావు కిలోకే పరిమితమయ్యాం. అందరికీ అందుబాటులో ఉండే వంకాయల ధర కూడా పెరిగిపోయింది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటకూర, చిర్రాకు, బచ్చలాకుతో పుల్లగూర చేసుకుని కానిచ్చేస్తున్నాము అని మహిళలు చెబుతున్నారు. 
 
మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిజ్‌ నిండా కూరగాయలుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్న మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే.. తెచ్చుకుందామనుకున్న కూరగాయల్లో సగమంటే సగం కూడా రాలేదు. మాకిష్టమైనవి కాకుండా ఏవి ధర తక్కువో అడిగడిగి కొనాల్సి వచ్చింది. ఈ ధరలు తగ్గేదాకా ఆకుకూరలతో సరిపెట్టుకోక తప్పదనిపిస్తోంది. ఉల్లిపాయలొక్కటే కొండెక్కలేదు. లేకపోతే పచ్చడి మెతుకులూ గగనమయ్యేవి’ అని కొందరు వాపోతున్నారు. 
 
కొండెక్కిన కూరగాయల ధరలతో జనం సతమతం అవుతుండగా, వంటిళ్లు కూరగాయలు లేక ఢీలాపడుతున్నాయని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనం సంపాదించే, ఖర్చుపెట్టే ప్రతి పైసాపై కేంద్రం నిఘా.. ఆధార్ లేకపోతే బ్యాంక్ ఖాతా కూడా క్లోజే.నట